ఎంపీ రేసులో సినీ హీరో వెంకటేష్ వియ్యంకుడు
రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. గతంలో పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు.
నామినేషన్ల గడువుకు ఒక్కరోజు ముందు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మహమ్మద్ సమీర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను అందులో వెల్లడించారు. ఇందులో ఆసక్తికరమైన విషయమేమంటే.. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు కావడం.
హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అంతేకాదు.. రఘురాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా వియ్యంకుడే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహమాడారు. ఆ విధంగా ఆయన ఇటు వెంకటేశ్‌కి, అటు మంత్రి పొంగులేటికి వియ్యంకుడు.
ఇక రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. గతంలో పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. ప్రస్తుతం వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు. తుది జాబితాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి రఘురాంరెడ్డి పేరును కూడా ప్రకటించారు. ఇక కరీంనగర్ నుంచి సీటు దక్కించుకున్న రాజేందర్‌రావు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.