రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత..
చివరిసారిగా ప్రభాస్ తో కలసి రాధేశ్యామ్ సినిమాలో నటించారు కృష్ణంరాజు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లో ఈరోజు తెల్లవారు జామున 3.25 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు వయసు 82 సంవత్సరాలు.
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న ఆయన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు ఆయన స్వగ్రామం. 26ఏళ్ల వయసులో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారిగా ప్రభాస్ తో కలసి రాధేశ్యామ్ సినిమాలో నటించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దాదాపు 200 పైగా సినిమాల్లో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు.
రాజకీయ జీవితం..
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు కృష్ణంరాజు. 1991లో తొలిసారిగా నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు.1998 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి కాకినాడ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం నుంచి గెలిచి వాజ్ పేయి మంత్రి వర్గంలో పనిచేశారు. 2009లో బీజేపీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. చివరిసారిగా రాజమండ్రి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ప్రభాస్ పెదనాన్నగా..
ప్రభాస్ హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఆయన ప్రభాస్ పెదనాన్నగా ఈ తరానికి బాగా పరిచయం. కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు ప్రభాస్. కృష్ణంరాజు కుటుంబంతో ప్రభాస్ కి మంచి అనుబంధం ఉంది. చివరి దశలో ప్రభాస్ సినిమాలో కనిపించారు కృష్ణంరాజు. మరో కొత్త సినిమా ప్రతిపాదనలో ఉండగా ఆయన చనిపోయారు.