బంగారం నుంచి వజ్రాల్లోకి దిగేసిన నాయకులు
ఎన్నికల అఫిడవిట్లలో నాయకులు ప్రకటిస్తున్న ఆస్తులు, కార్లు, భూముల కంటే బంగారు, వజ్రాభరణాల లెక్కలే చాలా ఆసక్తిగా ఉంటున్నాయి.
ఎన్నికల అఫిడవిట్లలో నాయకులు వెల్లడిస్తున్న ఆస్తుల వివరాలు జనాన్ని భలే ఆకట్టుకుంటాయి. ఈ సారి ఆస్తులు, కార్లు, భూముల కంటే నాయకులు ప్రకటిస్తున్న బంగారు, వజ్రాభరణాల లెక్కలు చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. కిలోల లెక్కన బంగారం, కోట్ల కొద్దీ వజ్రాభరణాలున్నాయని ప్రకటిస్తున్న నేతల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల వాళ్లూ ఉన్నారు.
దానం నాగేందర్‌కు బోల్డన్ని వజ్రాభరణాలు
ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ తనకు ఏకంగా రూ.6.68 కోట్ల విలువైన వజ్రాభరణాలున్నాయని ప్రకటించారు. సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ బంగారం అంటే మహా ఇష్టమేనని చెప్పారు. ఆమెకున్న బంగారు ఆభరణాలు జస్ట్ 8 కిలోలు..
కమలాకర్ ఇంట్లో ఆభరణాలు రూ.7 కోట్లట!
పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ తన 34 కోట్ల రూపాయల ఆస్తిలో 7 కోట్లు బంగారు, వజ్రాభరణాలేనని అఫిడవిట్‌లో ప్రకటించారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమున పేరిట స్థిర చరాస్తులన్నీ కలిపి రూ.41 కోట్లున్నాయని, ఇందులో కిలోన్నర బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్‌రెడ్డి రెండున్నర కిలోల బంగారు ఆభరణాలున్నాయని చెప్పారు. తన భార్య సబితకు రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలున్నాయని నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫిడవిట్‌లో రాశారు.
♦