Telugu Global
Telangana

మంత్రి కోమటిరెడ్డి సభలో రభస..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్‌ గూండాలు సందీప్ రెడ్డి పై దాడులకు పాల్పడ్డారని అన్నారామె.

మంత్రి కోమటిరెడ్డి సభలో రభస..
X

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్న సభలో రభస జరిగింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన గ్రామ పంచాయితీ భవనం ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. ఈ సభలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని మాట్లాడనీయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అసలు గొడవ మొదలైంది. జడ్పీ చైర్మన్ ను అడ్డుకోవడం ఏంటని బీఆర్ఎస్ నేతలు వారిని నిలదీశారు. దీంతో గొడవ పెద్దదైంది. మంత్రి జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సింది పోయి, మైక్ లాగేసుకుని సందీప్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మాధవరెడ్డి వంటి మహా నాయకుడి కడుపున పుట్టిన బచ్చా సందీప్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సందీప్ రెడ్డిని అక్కడినుంచి తరలించారు.

ముదురుతున్న గొడవలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కొన్నిరోజులు రాజకీయ వాతావరణం ప్రశాంతంగానే కనిపించింది. కానీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు కారణం అయ్యాయి. ఆ తర్వాత మెల్లగా పార్టీల మధ్య గ్రామాల్లో గొడవలు మొదలయ్యే పరిస్థితి నెలకొంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాల గొడవ మొదలైంది. అయితే ఇలాంటి గొడవలను సర్దిచెప్పాల్సిన మంత్రి ఏకపక్షంగా బీఆర్ఎస్ కు చెందిన జడ్పీ చైర్మన్ ని దుర్భాషలాడటం విశేషం. మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్‌ గూండాలు సందీప్ రెడ్డి పై దాడులకు పాల్పడ్డారని అన్నారామె. భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడ లేదని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. సందీప్‌రెడ్డిపై జరిగిన దాడిపై ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్నారు గొంగిడి సునీత.

First Published:  29 Jan 2024 4:23 PM IST
Next Story