ఆగని కాంగ్రెస్ నేతల ఫైటింగులు.. ఈసారి ఎక్కడంటే..
ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అంతకుముందు, వరంగల్, గద్వాల, వనపర్తిలోనూ హస్తం నేతలు కుస్తీకి దిగారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైటింగులు కొనసాగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బాన్సువాడలో జిల్లా కాంగ్రెస్ నేతలు ఏనుగు రవీందర్ రెడ్డి, అంబర్ సింగ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చందూరు ఎన్నికల కమిటీ సమావేశంలో ఇద్దరు నేతలు గొడవపడ్డారు. పార్టీ కమిటీ ఏర్పాట్లపై సమాచారం ఇవ్వకపోవడంతో అంబర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేతలిద్దరూ పరస్పరం తోసేసుకున్నారు. లీడర్లు కొట్టుకుంటే కార్యకర్తలు వచ్చి సముదాయించిన పరిస్థితి నెలకొంది.
గొడవలు ఇలాగే ఉంటే..
ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అంతకుముందు, వరంగల్, గద్వాల, వనపర్తిలోనూ హస్తం నేతలు కుస్తీకి దిగారు. ఎంపీ ఎన్నికల్లో 14సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఐక్యంగా లేకుండా ఇలాగే ముందుకెళ్తే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. అసలే బలహీనంగా ఉన్న పార్టీ ఇంటి గొడవలతో మరింత బలహీనమవడం ఖాయమనే చర్చ జరుగుతోంది.