CWC పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర పోటీ
CWC లో తెలంగాణ నుండి ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవిలు CWC పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ (CWC) అత్యున్నత కమిటీ. ముఖ్యమైన నిర్ణయాలన్నీ CWCయే తీసుకుంటుంది. ఆ కమిటీలో సభ్యత్వం కోసం నేతలందరూ తహతహలాడుతారు. సాధారణంగా CWC లో సీనియర్లకే అవకాశం ఇస్తారు. గతంలో ఉమ్మడి ఆంధ్రపదేశ్ నుండి కాసు బ్రహ్మానందంరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో పాటు ప్రస్తుత బీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు లకు అవకాశం దక్కింది. అయితే ఈ సారి CWC పదవి కోసం తెలంగాణలో తీవ్ర పోటీ నెలకొందని తెలుస్తోంది.
CWC లో తెలంగాణ నుండి ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవిలు CWC పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.
మొదటి నుంచి అధిష్టానంతో మంచి సంబంధాలున్న ఉత్తమ్ కే ఈ సారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదవి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఉత్తమ్ కూడా ఈ సారి తనకు అవకాశం వచ్చితీరుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ ప్రచారంతో మేలుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , జానారెడ్డిని రంగంలోకి దించినట్టు సమాచారం. జానారెడ్డి కోసం రేవంత్ ఢిల్లీలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జానారెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో జానారెడ్డి భేటీ కానున్నారు. తనకు పరిచయమున్న ఇతర ముఖ్య నేతలను కూడా కలిసి లాబీయింగ్ చేయనున్నట్టు సమాచారం.
సీతక్క చాలా సన్నిహితమైనప్పటికీ రేవంత్ ఆమెకు కాకుండా జానారెడ్డికి మద్దతు పలకడం వ్యూహాత్మకమైన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నేతలను ఎదుర్కోవాలంటే జానారెడ్డి అవసరం ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు.
మరో వైపు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన కోమటి రెడ్ది వెంకట రెడ్డి ఈ సారి ఎలాగైనా CWC పదవి సాధించాలన్న పట్టుదలగా ఉన్నారు. ఆయన మార్గంలో ఆయన ఢిల్లీ లో లాబీయింగ్ చేస్తున్నారు.
ఇక ఒకవేళ బీసీలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం అనుకుంటే తమకు అవకాశం వస్తుందని వీ. హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలు భావిస్తున్నారు. మరో వైపు రాహుల్ గాంధీతో మంచి పరిచయం ఉన్నందున తనకు కూడా అవకాశం రావచ్చని సీతక్క భావిస్తున్నారు.
మొత్తానికి CWC పదవి కోసం పలువురు నాయకులు చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎంత మంది ప్రయత్నించినా ఒకవేళ వస్తే ఒకరికే అవకాశం వస్తుంది. ఆ తర్వాత అవకాశం రాని మిగతా నాయకులు ఏం చేస్తారు? అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక పార్టీలో గందరగోళం సృష్టిస్తారా ? అనేది ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చ.