కూతుర్ని మంటల్లోకి విసిరేసిన తండ్రి
అక్కడే ఉన్న తన కూతురు అంకితను కాలుతున్న గడ్డివాములోకి విసిరేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఈ ఘటనతో బిత్తరపోయిన గంగాధర్.. వెంటనే తేరుకొని గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు.
ఏడేళ్ల కూతురిని కన్నతండ్రే కాలుతున్న గడ్డి వాములోకి విసిరేసిన దారుణ ఘటన ఆదివారం జరిగింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగెడ్గిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బరంగెడ్గి గ్రామానికి చెందిన దేశాయిపేట్ సాయిలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలిద్దరూ ఇంటి పక్కనే ఆడుకుంటున్నారు. అదే సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పంటుకుని దగ్ధమైంది.
ఈ ఘటనపై గడ్డివాము యజమాని గొట్టల గంగాధర్.. సాయిలుతో గొడవ పడ్డాడు. మీ కూతురు అంకిత మా గడ్డివాముకు నిప్పంటించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సాయిలు తీవ్ర అసహనం, ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడే ఉన్న తన కూతురు అంకితను కాలుతున్న గడ్డివాములోకి విసిరేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఈ ఘటనతో బిత్తరపోయిన గంగాధర్.. వెంటనే తేరుకొని గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు. అప్పటికే మంటల ప్రభావంతో రెండు కాళ్లు, చెయ్యి కాలడంతో బాలికను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అంకిత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.