Telugu Global
Telangana

మళ్ళీ దేశవ్యాప్త పోరాటానికి సిద్దమవుతున్న రైతులు

మార్చి 20న ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట మహా ధర్నా నిర్వహించాలని వివిధ రైతు సంఘాల ఐక్య‌వేదిక‌ సంయుక్త కిసాన్ మోర్చా(SKM) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బడ్జెట్ పై కూడా కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మళ్ళీ దేశవ్యాప్త పోరాటానికి సిద్దమవుతున్న రైతులు
X

అన్ని పంటలకు క‌నీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ, వ్యవసాయ రుణాల మాఫీ సహా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం మార్చి 20న ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట మహా ధర్నా నిర్వహించాలని వివిధ రైతు సంఘాల ఐక్య‌వేదిక‌ సంయుక్త కిసాన్ మోర్చా(SKM) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బడ్జెట్ పై కూడా కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది.

కురుక్షేత్రలోని జాట్ ధర్మశాలలో SKM నాయకులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు.

రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్, దెబ్బతిన్న పంటల బీమా క్లెయిమ్‌ల కోసం రైతు అనుకూల పాలసీ, విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఉపసంహరించుకోవడం తదితర డిమాండ్ లపై రైతులు తమ పోరాటాన్ని కొనసాగించనున్నారు.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని కేటాయింపుల్లో కోత కారణంగా కేంద్ర బడ్జెట్‌ను రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్‌గా రైతు నాయకులు అభివర్ణించారు.

SKM నాయకుడు యుధ్వీర్ సింగ్ మాట్లాడుతూ: “ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందున దేశవ్యాప్తంగా రైతులు మార్చి 20న ఢిల్లీకి చేరుకుని ఆందోళనను చేపట్టనున్నారు. ఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ రైతులపై నమోదైన కేసులను ఇంకా ఉపసంహరించుకోలేదు. రైతు ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు.'' అని ఆయన తెలిపారు.

“వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుంది. మా డిమాండ్లను అంగీకరించక తప్పదు. ప్రభుత్వానికి, మాకు కూడా ఈ వాస్తవం బాగా తెలుసు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతులు మళ్లీ ఆందోళనకు దిగాల్సి వస్తుంది. అన్ని రైతు సంఘాలు మార్చి 20న ఢిల్లీకి చేరుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.'' అని ఆయన అన్నారు.

రైతు నాయకులు తొమ్మిది-పాయింట్ల మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఇందులో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహణ కోసం 31 మంది సభ్యుల జాతీయ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం, వివిధ విభాగాల అనుబంధ సంఘాల‌ నియమకాలు జరపడం, SKMను ఏకీకృతం చేయడానికి, విస్తరించడానికి వ్యూహం రూపొందించడం లాంటివి ఉన్నాయి. .

First Published:  11 Feb 2023 4:20 PM GMT
Next Story