Telugu Global
Telangana

ప్రచారం అదిరిపోవాలి.. రుణమాఫీపై కాంగ్రెస్ కార్యాచరణ

రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు భట్టి. తల ఎత్తుకొని, ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలన్నారు.

ప్రచారం అదిరిపోవాలి.. రుణమాఫీపై కాంగ్రెస్ కార్యాచరణ
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన సందర్భంలో మాత్రమే ప్రచారం గట్టిగా జరిగింది. అందరూ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అలాంటి హడావిడి జరగలేదు సరికదా, వివిధ కారణాలతో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పరపతి పెరిగేలా ప్రచారాన్ని హోరెత్తించడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఘన కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చాటి చెబుతామంటున్నారు.

కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల సమస్యలు, రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలు.. వీటికితోడు పార్టీ ఫిరాయింపులు, లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ.. ఇలా కాంగ్రెస్ కి అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఇలాంటి టైమ్ లో రుణమాఫీ అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో లక్షలోపు రైతుల రుణాలు మాఫీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మళ్లీ ప్రజల్లో సానుభూతి పెరగాలని నేతలు గట్టి ప్లాన్ సిద్ధం చేశారు.


ప్రభుత్వం చేస్తున్న మంచి పనిగా రుణమాఫీని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని, తొలిసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేస్తోందని, ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్లమెంట్‌లో కూడా తెలంగాణ ఎంపీలు రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించాలన్నారు. రుణమాఫీ తొలివిడతకు సంకేతంగా రేపు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు భట్టి. తల ఎత్తుకొని, ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేయాలన్నారు.

First Published:  17 July 2024 6:46 PM IST
Next Story