Telugu Global
Telangana

పాపం…కాంగ్రెస్ బలైపోయిందా?

కన్యాకుమారిలో పాదయాత్ర మొదలైన దగ్గర నుండి రాహుల్ యాత్రకు విశేషంగా స్పందన వస్తోందన్నది వాస్తవం. తెలంగాణలో కూడా స్పందన ఇలాగే ఉన్నా దానికి ప్రచారం మాత్రం కనబడటం లేదు. ఎందుకంటే రాహుల్ పాదయాత్ర ప్రచారానికి ఎమ్మెల్యేల బేరసారాల గ్రహణం అడ్డుపడింది.

పాపం…కాంగ్రెస్ బలైపోయిందా?
X

గడచిన నాలుగు రోజులుగా అధికార టీఆర్ఎస్-బీజేపీ మధ్య తలెత్తిన వివాదం దెబ్బకు కాంగ్రెస్ బలైపోయింది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల‌ను కొనేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని, నలుగురిని కొన్నంతమాత్రాన తమ పార్టీకి వచ్చే లాభం ఏమిటంటూ కమలనాధులు ఎదురుదాడి చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఒక ఫాంహౌస్‌లో జరిగిన బేరసారాల ఘటన తాజా వివాదానికి మూలం.

అప్పటి నుండి మీడియాలో ఎమ్మెల్యేల బేరసారాల గోలే సరిపోతోంది. ఏ ఛానల్ చూసినా, ఏ పత్రిక చూసినా ఈ వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల బేరసారాల దెబ్బకు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం కూడా మరుగునపడిపోయింది. ఈ రెండు పార్టీల మధ్య గొడవల కారణంగా బాగా దెబ్బతిన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ అనే చెప్పాలి. అసలే మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పరిస్ధితి అంతంతమాత్రంగా ఉంది.

సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే ఫాంహౌస్ ఘటన ప్రభావం రాహుల్ పాదయాత్ర మీద పడింది. కర్నాటకలో నుండి తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ఎంటరైన రోజున జనాలు పెద్దఎత్తున హాజరయ్యారు. మూడు రోజుల విరామం తర్వాత మళ్ళీ మొన్నటి గురువారం మొదలైంది. రాహుల్ యాత్రలో పార్టీ నేతలతో పాటు మామూలు జనాలు కూడా బాగా స్పందిస్తున్నారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు, ప్రత్యేకించి యువత, విద్యార్ధులు విపరీతంగా హాజరవుతున్నారు.

కన్యాకుమారిలో పాదయాత్ర మొదలైన దగ్గర నుండి రాహుల్ యాత్రకు విశేషంగా స్పందన వస్తోందన్నది వాస్తవం. తెలంగాణలో కూడా స్పందన ఇలాగే ఉన్నా దానికి ప్రచారం మాత్రం కనబడటం లేదు. ఎందుకంటే రాహుల్ పాదయాత్ర ప్రచారానికి ఎమ్మెల్యేల బేరసారాల గ్రహణం అడ్డుపడింది. పాదయాత్ర వార్తలు, ఫొటోలను మీడియా అనివార్యంగా లోపల పేజీల్లోకి పంపేయాల్సొస్తోంది.

తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన రాహుల్ పాదయాత్రకు తెలంగాణ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించింది. ప్రత్యేక కథనాలు అందించింది. అలాంటిది తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రకు మాత్రం రావాల్సినంత ప్రచారం రావటం లేదు. దీనికి కారణం ఎమ్మెల్యేల బేరసారాల ఘటనే ప్రధాన కారణమని చెప్పాలి.

First Published:  29 Oct 2022 11:23 AM IST
Next Story