ఫాం హౌస్ కేసు.. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరైన లాయర్ ప్రతాప్
సిట్ నోటీసులు అందుకున్న లాయర్ ప్రతాప్ గౌడ్ శనివారంనాడు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌తో ప్రతాప్ గౌడ్ జరిపిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. సిట్ నోటీసులు అందుకున్న లాయర్ ప్రతాప్ గౌడ్ శనివారంనాడు మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తనకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయంచారు. తగిన కారణాలు ఉన్నందునే విచారణకు రావాలని పిలిచామని సిట్ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు హాజరవ్వాలంటూ ప్రతాప్ కు సూచిస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ప్రతాప్ గౌడ్ ను అరెస్టు చేయవద్దని సిట్ ను హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌తో ప్రతాప్ గౌడ్ జరిపిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి లాయర్ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు శుక్రవారంనాడు విచారించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పలు ఆధారాలను ప్రతాప్ ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. సిట్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలపై ప్రతాప్ గౌడ్ జవాబులు దాటవేశారని సమాచారం.
నందకుమార్, ప్రతాప్ గౌడ్ మధ్య జరిగిన లావాదేవీలతో పాటు ఆయన ఫోన్ కాల్ డేటాను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ వివరాలను ప్రతాప్ గౌడ్ ముందుంచి ఆయన్ను శనివారం నాడు మరోసారి విచారించనున్నారు. అలాగే సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో మరో వ్యక్తి కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ శుక్రవారంనాడు సిట్ విచారణకు హాజరు కావల్సి ఉండగా గాయం కారణంగా తాను హాజరుకాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.