Telugu Global
Telangana

ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజ్‌... తెలంగాణ ఆర్టీఏకు కాసుల వర్షం

ఇంకా ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాకముందే తెలంగాణ ఆర్టీఏకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేవలం ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారానే రూ. 53 కోట్ల ఆదాయం వచ్చి చేరింది.

ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజ్‌... తెలంగాణ ఆర్టీఏకు కాసుల వర్షం
X

ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక లగ్జరీ కార్లకు నెలవైన హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో ఆ క్రేజ్‌ కాస్త ఎక్కువే. సెంటిమెంట్‌, లక్కీ నెంబర్స్‌ దక్కించుకునేందుకు కార్ల యజమానులు ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ఇప్పుడు ఇది తెలంగాణ ఆర్టీఏకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇంకా ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కాకముందే తెలంగాణ ఆర్టీఏకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కేవలం ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారానే రూ. 53 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. ఇదే స్పీడ్‌ కంటిన్యూ అయితే ఈ ఏడాది చివరి నాటికి ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదిలో వచ్చిన రూ.72 కోట్లను ఈజీగా అధిగమిస్తామని అధికారులు చెప్తున్నారు.

9999, బాండ్ స్టైల్‌ 0001, 0007, 0009 నెంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్తున్నారు అధికారులు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధికంగా 9999 నెంబర్‌ను వేలం వేశామంటున్నారు. ఈ నెంబర్‌ కోసం ఆగస్టులో ఖైరతాబాద్‌ ఆర్టీఓలో ఓ యజమాని అత్యధికంగా రూ.21 లక్షల 60 వేలు చెల్లించారని చెప్తున్నారు. ఇదే నంబర్ కొండాపూర్ ఆర్టీఓలో 12 లక్షల రూపాయలు పలికిందని.. మలక్‌పేట్‌ ఆర్టీఓలో ఓ వ్యక్తి రూ.9 లక్షలు చెల్లించారని అధికారులు చెప్తున్నారు. ఇక మరో 0009 నెంబ‌ర్‌ కోసం ఖైరతాబాద్‌ ఆర్టీఓలో ఓ వ్యక్తి ఏకంగా రూ.10 లక్షల 50 వేలు చెల్లించాడు.

చాలా మంది 9ని లక్కీ నెంబర్‌గా భావిస్తారు. 9999 నెంబర్‌లో మొత్తం 9 ఉండడంతో ఎక్కువ మంది ఈ నెంబర్‌ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్తలు, కన్‌స్ట్రక్షన్ కంపెనీల నుంచి ఈ నెంబర్‌ కోసం పోటీ ఎక్కువ ఉందని సమాచారం. ఇక వీటితో పాటు 0269, 1223 లాంటి నంబర్లకు కూడా పోటీ ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. ఎందుకంటే పేరెంట్స్, పిల్లల బర్త్ డే డేట్స్ ఆధారంగా వీటి కోసం పోటీపడుతుంటారని చెప్తున్నారు.


First Published:  22 Sept 2023 5:39 AM GMT
Next Story