ప్రముఖ రచయిత్రి కే.రామలక్ష్మి కన్నుమూత
ఆమె స్వగ్రామం కాకినాడ సమీపంలోని కోటనందూరు. 31 డిసెంబరు 1930లో జన్మించిన రామలక్ష్మి 1954లో ఆరుద్రను వివాహం చేసుకున్నారు. మద్రాస్ స్టెల్లా మేరీస్ మహిళా కళాశాలలో ఆమె డిగ్రీ చేశారు. ‘తెలుగు స్వతంత్ర’ పత్రిక లో ఆమె సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు ఆరుద్ర, శ్రీశ్రీ వంటి సాహితీవేత్తలు పరిచయమయ్యారు.
ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, ఆరుద్ర సతీమణి కూచి రామలక్ష్మి కన్నుమూశారు. 93 సంవత్సరాల రామలక్ష్మి కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హైదరాబాద్ మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు.
ఆమె స్వగ్రామం కాకినాడ సమీపంలోని కోటనందూరు. 31 డిసెంబరు 1930లో జన్మించిన రామలక్ష్మి 1954లో ఆరుద్రను వివాహం చేసుకున్నారు. మద్రాస్ స్టెల్లా మేరీస్ మహిళా కళాశాలలో ఆమె డిగ్రీ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ఖాసా సుబ్బారావు పోత్సాహంతో ‘తెలుగు స్వతంత్ర’ పత్రిక లో ఆమె సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు ఆరుద్ర, శ్రీశ్రీ వంటి సాహితీవేత్తలు పరిచయమయ్యారు.
రచయిత్రిగా ఆమె అనేక కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశారు. తెలుగు సాహిత్య రంగంలోని కవులు, రచయితల దాంపత్య జీవితాలను ప్రస్తావిస్తూ ‘వెలసిపోయిన దాంపత్యం’ పేరుతో పుస్తకం రాశారు. విడదీసే రైలు బళ్లు , మెరుపుతీగ, అవతలి గట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించు ప్రేమకై, ఆంధ్ర నాయకుడు వంటి 15కు పైగా నవలలు రాశారు. జీవనజ్యోతి, చిన్నారి పాపలు వంటి సినిమాలకు కథ, మాటలు అందించారు.
ఆమె అంత్యక్రియలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సంజీవరెడ్డినగర్‌లోని విద్యుత్ దహన వాటికలో నిర్వహించినట్లు కుమార్తె కవిత తెలిపారు. ఆరుద్ర అంత్యక్రియలను రామలక్ష్మి ఆచార, సంప్రదాయాలకు అతీతంగా ఎంత నిరాడంబరంగా నిర్వహించారో అదే పద్దతిలో ఆమె అంత్యక్రియలను కూడా జరిపించామని ఆమె కుమార్తె తెలిపారు.