టీవీ-5 మూర్తి వేధింపులు, సూసైడ్ చేసుకుంటా - వేణుస్వామి సంచలనం
మూర్తి తమను రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తన బంగారం, తన కూతురు బంగారం అమ్మిన అందులో 5 శాతం కూడా రాదన్నారు వాణి.
ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి టీవీ-5 జర్నలిస్టు మూర్తిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తన భార్యతో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి. మీడియా ముసుగులో మూర్తి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు వేణుస్వామి దంపతులు.
వేణుస్వామి దంపతుల వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. దాదాపు నిమిషం 50 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో వేణుస్వామి దంపతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 2017లో మహాటీవీలో ఉన్న నాటి నుంచి మూర్తి తనను టార్గెట్ చేశారని చెప్పారు వేణుస్వామి. అతను అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో గత 8 నెలలుగా మూర్తి టీమ్ తనపై దాడులు చేస్తోందన్నారు. డబ్బులు ఇచ్చి మరీ మూర్తి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. దీంతో మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలన్న స్థితికి చేరుకున్నట్లు చెప్పారు. మానసిక క్షోభతో గడిచిన 8 నెలల్లో 15 కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు. ఈ ఇష్యూకు సంబంధించి ఓ ఆడియోను కూడా రిలీజ్ చేశారు వేణుస్వామి దంపతులు.
వేణుస్వామి భార్య వాణి సైతం మూర్తిపై సంచలన ఆరోపణలు చేశారు. మూర్తి తమను రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తన బంగారం, తన కూతురు బంగారం అమ్మిన అందులో 5 శాతం కూడా రాదన్నారు వాణి. తాను కూడా ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని, కానీ మూర్తి ఎలాంటి వాడో బయటపెట్టాలనే ఈ వీడియో తీసుకున్నట్లు చెప్పారు. ఈ వీడియో బయటకు వస్తే తమను చంపేసే ప్రమాదం ఉందని, అయినప్పటికీ భయపడుకుండా ఈ వీడియో చేశామన్నారు వాణి.