కుటుంబాన్ని బలితీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్.. - విషం తీసుకొని ముగ్గురు మృతి
15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితో పాటు స్నేహితులు వచ్చి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడొద్దని హితవు పలికారు. బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి ఓ కుటుంబం బలైంది. నాలుగేళ్ల కుమారుడు సహా భార్యాభర్తలు విషం తీసుకొని ప్రాణాలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగిన ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38), ఇందిర (36) దంపతులు మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడ జాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. వారికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటుపడ్డాడు. అందులో బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు.
ఈ విషయమై దంపతులిద్దరి మధ్య నిత్యం గొడవలుజరిగేవి. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు కూడా తెలియడంతో 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితో పాటు స్నేహితులు వచ్చి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడొద్దని హితవు పలికారు. బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడినట్టు సమాచారం.
దీనిపై సోమవారం ఉదయం నుంచి దంపతులిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతో పాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్‌మెంట్‌కి వచ్చి చూడగా, ముగ్గురూ మృతిచెంది ఉన్నారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.