పోలీస్ రిక్రూట్మెంట్‌పై తప్పుడు ప్రచారం.. మోసపోవద్దని అధికారుల సూచన
ప్రభుత్వ అధికారులు అనేకసార్లు ఈ పరీక్షలు సజావుగానే నిర్వహిస్తున్నామని చెప్పినా కావాలనే కొందరు రాజకీయ నాయకులు కూడా దీనికి జత కలిసి కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్‌లో భాగంగా జరుగుతున్న ఫిజికల్ ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షల) మీద కొంతమంది పనిగట్టుకుని అబద్ధాలను ప్రచారం చేశారు. ఇటు సోషల్ మీడియాలో అటు రోడ్ల మీద కొంతమంది నిరసనలు వ్యక్తపరిచారు. ప్రభుత్వ అధికారులు అనేకసార్లు ఈ పరీక్షలు సజావుగానే నిర్వహిస్తున్నామని చెప్పినా కావాలనే కొందరు రాజకీయ నాయకులు కూడా దీనికి జత కలిసి కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
నిన్న తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫిజికల్ ఈవెంట్స్ ఫలితాలు విడుదల చేశాక చూస్తే ఆ ఆరోపణలు అన్నీ అబద్ధాలు అని తేలిపోయింది:
ఆరోపణ 1: ఈసారి నిబంధనలు మార్చడం వల్ల అతి తక్కువ మంది అభ్యర్ధులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యారు:
నిజం 1: ఇది పూర్తిగా అవాస్తవం. 2018-19లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్‌లో 48.5% మంది అభ్యర్ధులు ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణులు కాగా, ఇప్పుడు 2022-23 లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్‌లో 53.7% అభ్యర్ధులు ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణులు అయ్యారు.
ఆరోపణ 2: లాంగ్ జంప్ నిబంధనలు మార్చడం వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు
నిజం 2: లాంగ్ జంప్‌లో ఫిజికల్ అటెండ్ అయిన ప్రతి 100 మంది అభ్యర్థులకు 83 మంది క్వాలిఫై అయ్యారు, కేవలం 17 శాతం మాత్రమే దీనిలో ఉత్తీర్ణులు కాలేదు. కాబట్టి పై ఆరోపణలు అవాస్తవం
ఆరోపణ 3: షాట్ పుట్‌లో నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల ఎక్కువ మంది క్వాలిఫై కాలేదు.
నిజం 3: షాట్ పుట్‌లో 91శాతం మంది పురుషులు, 96 శాతం మహిళలు అర్హత సాధించారు. అసలు ఇంతమంది అర్హత సాధించాక కూడా ఇంకా ఆరోపణలు చేయడం దుర్మార్గం.
మొత్తం 2,07,106 మంది ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులు రాస్తే ఏకంగా 1,11,209 ఇందులో అర్హత సాధించారు. ఏ రిక్రూట్మెంట్ పరీక్షలో అయినా హాజరయిన అందరూ పాస్ కారు. అలా అయితే అసలు ఆ పరీక్ష అవసరమే లేదని అర్థం!
ఈ సారి ఫిజికల్ ఈవెంట్స్ కోసం తొలిసారి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ప్రక్రియ అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. పూర్తి స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి ఫిజికల్ ఈవెంట్లలో పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేశారు. లాంగ్ జంప్, షాట్‌పుట్‌లో ఒకొక్కరికి మూడు సార్లు అవకాశం ఇచ్చారు. తొలిసారి ప్రతి అభ్యర్థికి డిజిటల్ ఆర్‌ఎఫ్‌ఐడీ రిస్ట్ బ్యాండ్‌ను అందించారు. ఎక్కడా లోపాలు జరగకుండా ఎత్తు కొలిచేందుకు కూడా డిజిటల్ యంత్రాలను వినియోగించినట్టు అధికారులు చెప్పారు. ఎత్తు విషయంలో పలువురు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేశామని పేర్కొన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షకు కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేసినట్టు వివరించారు.
తెలంగాణలో జరుగుతున్న వరుస రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకులు, మరికొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కలిసి ఆడుతున్న ఈ మాయా క్రీడలో నిరుద్యోగులు బలి కావద్దు అని అధికారులు సూచిస్తున్నారు.