నకిలీ పోలీసులు, ఫేక్ చెకింగ్ లు.. హైదరాబాద్ వ్యాపారుల్లో భయం
హైదరాబాద్ లో దో నంబర్ దందా ఎక్కువగా జరిగే హోల్ సేల్ మార్కెట్లు, హవాలా వ్యాపారులను టార్గెట్ చేసి అందినంత దోచేస్తున్నారు కేటుగాళ్లు. బేగంబజార్, సికింద్రాబాద్ మోండా మార్కెట్ సహా గోల్డ్ బిజినెస్ జరిగే పాన్ మార్కెట్ వ్యాపారులకు ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి.
ఎన్నికల సీజన్ లో పరిమితికి మించి డబ్బు తీసుకెళ్లాలంటే ఎవరికైనా భయమే. నీతిగా, నిజాయితీగా సంపాదించిన సొమ్మయినా, ఎన్నికలతో సంబంధం లేకపోయినా.. లెక్కలు చెప్పాలంటే కష్టమైన పనే. వ్యాపారులకు అది మరీ కష్టం. అందుకే వారు మరింత హడలిపోతున్నారు. ఈ భయాన్ని ఆసరాగా తీసుకుని కొందరు కేటుగాళ్లు వ్యాపారుల్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీసులం అని చెప్పి భయభ్రాంతులకు గురిచేసి అందినకాడికి గుంజేస్తున్నారు. ఇలాంటి నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అసలు పోలీసులు.
గోషామహల్ కు చెందిన హోల్ సేల్ వ్యాపారి గతవారం రూ.25 లక్షలతో ఇంటికి బయలుదేరాడు. మెయిన్ రోడ్లపై పోలీస్ చెక్ పోస్ట్ లు ఉండటంతో గల్లీల నుంచి వెళ్తున్నాడు. ఆ వ్యాపారిని వెంబడించిన ఇద్దరు యువకులు బైక్ అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పి బెదిరించి రూ.5 వేలు వసూలు చేశారు. కాసేపటికి ఆ మోసం గ్రహించిన బాధితుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
హైదరాబాద్ లో దో నంబర్ దందా ఎక్కువగా జరిగే హోల్ సేల్ మార్కెట్లు, హవాలా వ్యాపారులను టార్గెట్ చేసి అందినంత దోచేస్తున్నారు కేటుగాళ్లు. బేగంబజార్, సికింద్రాబాద్ మోండా మార్కెట్ సహా గోల్డ్ బిజినెస్ జరిగే పాన్ మార్కెట్ వ్యాపారులకు ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి. హోల్ సేల్ మార్కెట్లలో ప్రతి రోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. జీఎస్టీ సహా ఇతర ట్యాక్స్ లను తప్పించుకునేందుకు రెండు రకాల వ్యాపారాలు చేస్తుంటారు. బిల్ లో ఉండే రేటు వేరు, జరిగే బిజినెస్ వేరు. ఇలాంటి చోట డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్స్ ఉండవు. కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటారు. అంటే ప్రతి వ్యాపారి వద్ద నోట్ల కట్టలు ఉంటాయి. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే సవాలక్ష కండిషన్లు ఉంటాయి, విత్ డ్రా సమయంలో కూడా పెద్ద మొత్తాలు బయటకు తీసుకోలేరు. నగదు రూపంలోనే రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలన్నీ జరుగుతుంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు వ్యాపారుల వద్దే ఉంటుంది. దీంతో కేటుగాళ్లు సులభంగా వ్యాపారుల్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీసుల పేరుతో వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒకవేళ వారు నకిలీ అని తెలిసినా కూడా కొన్నిసార్లు తప్పించుకోలేని పరిస్థితి. పోలీసులకు సమాచారం ఇస్తామంటూ బెదిరించి మరీ వ్యాపారుల్ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది.