Telugu Global
Telangana

విద్వేషం నింపేందుకే విష ప్రచారం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు "విద్య మా హక్కు" అనే అర్థం వచ్చేలా "హం బచ్చోంకా నారా హై! తాలీంకా హక్ హమారా హై!" అనే నినాదాలు చేశారు.

విద్వేషం నింపేందుకే విష ప్రచారం
X

ఆఖరికి బడిపిల్లలు చేసిన నినాదాలను కూడా వక్రీకరించి కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. చివరకు అది ఫేక్ వీడియో అని రుజువు కావడంతో పోలీసు కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో జరిగింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలు చేసిన నినాదాలను వక్రీకరించి ఓ ఛానెల్ లో ప్రసారం చేశారు.

అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు తయారైంది మీడియా పరిస్థితి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో బడిపిల్లలు పాకిస్తాన్ హమారా అనే నినాదాలు చేశారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేశాడు. ఇంకేముంది దాన్ని పట్టుకుని నేరుగా ఓ టీవీ ఛానెల్ లో ప్రసారం చేశారు. అసలు పిల్లలు అన్నదేంటి, అక్కడ చెబుతున్నదేంటి అనేది ఎవరికీ పట్టలేదు. తీరా ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ కి చేరింది.

కొత్త విద్యా సంవత్సరం పిల్లలంతా బడులకు తిరిగి రావాలనే ఉద్దేశంతో బడిబాట కార్యక్రమం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో జరిగినట్టే నిర్మల్ లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు "విద్య మా హక్కు" అనే అర్థం వచ్చేలా "హం బచ్చోంకా నారా హై! తాలీంకా హక్ హమారా హై!" అనే నినాదాలు చేశారు. దీన్ని వక్రీకరించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రసారం చేశాడు. ఆ తర్వాత కొన్ని మీడియా ఛానెళ్లు ఆ వక్రీకరణనే హైలెట్ చేశాయి. 'పాకిస్థాన్ హమారా హై' అంటూ విద్యార్థులు నినాదాలు చేశారని వార్తలు ప్రసారం చేశాయి. ఆ వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై నిర్మల్ జిల్లా పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజలలో ద్వేషం నింపే తప్పుడు ప్రచారాల వలన సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు పోలీసులు. అసత్య సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First Published:  28 Jun 2023 8:08 PM IST
Next Story