Telugu Global
Telangana

మోసానికి పరాకాష్ట.. నకిలీ జడ్జి అవతారం

బాధితులను కలిసే సమయంలో అతడి బిల్డప్ మామూలుగా ఉండేది కాదు. జడ్జి తరహాలోనే సెటప్ అంతా ఉండేది. అతడికి ఓ అసిస్టెంట్ కూడా ఉండేవాడు. నిజంగానే నరేందర్ ని జడ్జిగా భ్రమపడి చాలామంది అతడికి డబ్బు ముట్టజెప్పారు.

మోసానికి పరాకాష్ట.. నకిలీ జడ్జి అవతారం
X

నకిలీ బాబాలు, నకిలీ పోలీసులు, నకిలీ అధికారులు ఇలా చాలామందినే చూసుంటాం. ఈమధ్య నకిలీ ఐటీ ఆధికారులు కూడా పుట్టుకొచ్చారు. అయితే ఇలాంటి మోసాలకు పరాకాష్ట ఓ నకిలీ జడ్జి. ఏకంగా జడ్జి అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని, అతడి అసిస్టెంట్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే యువకుడు డిగ్రీ చదవి ఉపాధి వెదుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు అలవాటుపడి పలుమార్లు పోలీసులకు చిక్కాడు, జైలుకి కూడా వెళ్లొచ్చాడు. ఆ తర్వాత వైట్ కాలర్ మోసాలు మేలని భావించాడు. ఏకంగా నకిలీ జడ్జి అవతారమెత్తాడు.

సోషల్ మీడియా సాయంతో..

వివాదాస్పద భూముల కేసులు త్వరగా పరిష్కరిస్తాంటూ ఓ ఫేస్ బుక్ పేజీని రూపొందించాడు నరేందర్. ఆ పేజ్ ద్వారా బాధితులను ఆకర్షించి వారి వివరాలు సేకరించి తన వద్దకు రప్పించుకునేవాడు. బాధితులను కలిసే సమయంలో అతడి బిల్డప్ మామూలుగా ఉండేది కాదు. జడ్జి తరహాలోనే సెటప్ అంతా ఉండేది. అతడికి ఓ అసిస్టెంట్ కూడా ఉండేవాడు. నిజంగానే నరేందర్ ని జడ్జిగా భ్రమపడి చాలామంది అతడికి డబ్బు ముట్టజెప్పారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన గార్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి దగ్గర 10లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడు. ఎంతకీ కేసు పరిష్కారం కాకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నకిలీ జడ్జి వ్యవహారం చూసి షాకయ్యారు. నకిలీ జడ్జిని, అతడికి గన్ మెన్ గా, అసిస్టెంట్ గా ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిద్దరినుంచి నగదు, నకిలీ జడ్జి ఐడీ కార్డ్, పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

First Published:  28 July 2023 9:26 PM IST
Next Story