Telugu Global
Telangana

కరోనా రోగులకు చికిత్స చేశాడు.. తీరా చూస్తే అతడో ఫేక్ డాక్టర్

కరోనా రోగులకు చికిత్స చేశాడు.. తీరా చూస్తే అతడో ఫేక్ డాక్టర్
X

కరోనా సమయంలో చాలా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి కరువొచ్చి పడింది. ఆసుపత్రులు అప్పటికప్పుడు తాత్కాలిక పద్దతుల్లో వైద్యులు, నర్సులకు భారీ జీతాలు ఇచ్చి జాయిన్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ సంపాదించి డాక్టర్ అవతారం ఎత్తాడు. కరోనా సమయంలో మెడికల్ ఆఫీసర్‌గా సేవలు అందించాడు. తాజాగా ఫిజిషియన్ అని చెప్పుకుంటూ వైద్యం చేస్తున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో అతడి గుట్టు బయటపడింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన కుదిలెట్టి విజయ్‌కుమార్ (36) డిస్టెన్స్ బీఎస్సీ చేశాడు. ఆ తర్వాత పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాంపౌండర్‌, పీఆర్వోగా పని చేశాడు. డాక్టర్లతో నిత్యం కలిసి తిరుగుతుండటంతో అతడికి చిన్న రోగాలకు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు ఇవ్వడం తెలిసింది. నెమ్మదిగా కొన్ని రోగాలకు ఏయే ట్యాబ్లెట్స్ ఇవ్వాలో తెలుసుకొని ఇక డాక్టర్ అవతారం ఎత్తాలని స్కెచ్ వేశాడు.

ముందుగా దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్వోగా పని చేశాడు. ఆ సమయంలో వికారాబాద్ జిల్లాకు చెందిన అఫ్రోజ్ ఖాన్ పరిచయం అయ్యాడు. సిటిస్కాన్ మెషిన్‌ రిపేర్ చేసే అఫ్రోజ్ ఖాన్‌కు విజయ్ తన ప్లాన్‌ను చెప్పాడు. ఎలాగైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇప్పించమని కోరాడు. ఈ క్రమంలో అఫ్రోజ్ ఖాన్ తన స్నేహితుడైన అలీ జునైద్‌ను పరిచయం చేశాడు. అలీ జునైద్ ఒక యాప్ ఉపయోగించి ఫేక్ సర్టిఫికెట్ల‌ను తయారు చేసేవాడు. విజయ్‌కుమార్‌కు ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. డీల్ కుదిరిన తర్వాత రష్యాలోని కజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్ ఫార్మాట్ డౌన్‌లోడ్ చేసి.. యాప్ సహాయంలో ఫేక్ సర్టిఫికెట్ తయారు చేశాడు. దీన్ని విజయ్‌కుమార్‌కు అప్పగించాడు.

రష్యా వెళ్లి వచ్చినట్లు పాస్‌పోర్ట్ కూడా ఉండాలి. కాబట్టి.. పాస్‌పోర్టుపై ఫేక్ ఇమిగ్రేషన్ స్టాంప్ కూడా వేసిచ్చాడు. ఇలా సర్టిఫికెట్‌కు రూ. 4.50 లక్షలు, ఇమిగ్రేషన్ స్టాంపుకు రూ. 1.50 లక్షలు వసూలు చేశాడు. మీడియేటర్‌గా ఉన్న అఫ్రోజ్ ఖాన్ మరో రూ. 2 లక్షలు తీసుకున్నాడు. అంతా సవ్యంగా ముగిసిన తర్వాత డాక్టర్ అవతారం ఎత్తాడు.

కరోనా టైంలో ఉప్పల్‌లోని లైఫ్ కేర్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాడు. నెలకు రూ. 60వేల జీతం తీసుకుంటూ.. ఆరు నెలల పాటు పని చేశాడు. ఆ సమయంలో కరోనా పేషెంట్లకు డ్యూటీ డాక్టర్‌గా సేవలు అందించాడు. ఆరు నెలల అక్కడ పని చేసిన తర్వాత, మానేసి కర్మాన్‌ఘాట్‌లోని ఆర్కే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ఎండీ ఫిజిషియన్ అని చెప్పుకొని పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేవాడు.

అయితే విజయ్‌కుమార్ గురించి తెలిసిన కొంత మంది ఫేక్ డాక్టర్ అంటూ మీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు. అసలు నిజం తెలుసుకున్న తర్వాత విజయ్ కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశాడు. అతడికి ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చిన అలీతో పాటు సహకరించిన అఫ్రోజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయ్ కుమార్ దగ్గర ఉన్న మొత్తం 8 ఫేక్ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ చెప్పారు. సర్టిఫికెట్లు పరిశీలించకుండా చేర్చుకున్న ఆసుపత్రులకు కూడా నోటీసులు జారీ చేశారు.

First Published:  23 July 2022 8:51 AM IST
Next Story