నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు - యూ ట్యూబ్ చూసి అచ్చేసి.. చెలామణి
మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు 300, కలర్ ప్రింటర్, ఏడు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు, నకిలీ నోట్లు ముద్రించడానికి ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
సులభంగా డబ్బు సంపాదించడమే వారి టార్గెట్.. సయ్యద్ యాకూబ్, గడ్డం ప్రవీణ్, గుండా రజని కలిసి.. ఓ కిడ్నాప్‌కు యత్నించి పోలీసులకు చిక్కి జైలులో ఊచలు లెక్కించారు. ఆ సమయంలో నకిలీ నోట్ల ముఠాతో ఏర్పడిన పరిచయం అటువైపు ఆలోచించేలా చేసింది. అంతే.. వారి నుంచి నకిలీ నోట్ల ముద్రణ గురించి వివరాలు సేకరించారు. జైలు నుంచి విడుదలయ్యాక.. నకిలీ నోట్ల ముద్రణ గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. నేర చరిత్ర కలిగిన మరికొందరిని కలుపుకొని నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించారు.
తాము ముద్రించిన నకిలీ నోట్లను రద్దీగా ఉండే ప్రాంతాల్లోని కిరాణా, బట్టల దుకాణాలు, మద్యం, బెల్ట్ షాపుల వద్దకు తీసుకెళ్లి చెలామణి చేసేవారు. ఇలా ఏడాది కాలంగా చుట్టు పక్కల జిల్లాల్లోనూ నకిలీ నోట్లను చెలామణి చేశారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.
శుక్రవారం కూడా ప్రధాన నిందితుడు సయ్యద్ యాకూబ్, మరో నిందితుడు అవినాష్‌తో కలసి సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిరుమల్ బార్ వద్దకు వచ్చాడు. ఈలోగా వీరు దొంగ నోట్లతో వచ్చారంటూ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మిగిలిన ముఠా పేర్లనూ నిందితులు వెల్లడించారు. వారు అందించిన సమాచారంతో మిగిలిన నిందితులనూ అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నకిలీ రెండు వేల రూపాయల నోట్లు 300, కలర్ ప్రింటర్, ఏడు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు, నకిలీ నోట్లు ముద్రించడానికి ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శుక్రవారం వెల్లడించారు. సయ్యద్ యాకూబ్ అలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), పేరాల అవినాష్, కత్తి రమేష్, ఎండీ అక్రం అలీ, గడ్డం ప్రవీణ్, గుండ్ల రజని, కత్తి సునీత, సోహెల్‌తో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో ప్రధాన నిందితుడు ఎండీ సమీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.