నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు - సర్టిఫికెట్లు కొన్నవారినీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం
డిగ్రీకి లక్ష రూపాయలు, ఇంజనీరింగ్, ఆపై సర్టిఫికెట్లకు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్న ఈ ముఠా.. కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసి, నకిలీ ధ్రువపత్రాలను తీసుకున్న అభ్యర్థుల పేర్లను అందులో అప్‌లోడ్ చేస్తున్నారని వరంగల్ సీపీ తరుణ్ జోషి బుధవారం తెలిపారు.
నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొన్ని విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ చదివినట్టుగా సర్టిఫికెట్లు రూపొందిస్తూ, వాటికి ధర నిర్ణయించి అమ్మేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పోలీసులు. డిగ్రీకి లక్ష రూపాయలు, ఇంజనీరింగ్, ఆపై సర్టిఫికెట్లకు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్న ఈ ముఠా.. కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసి, నకిలీ ధ్రువపత్రాలను తీసుకున్న అభ్యర్థుల పేర్లను అందులో అప్‌లోడ్ చేస్తున్నారని వరంగల్ సీపీ తరుణ్ జోషి బుధవారం తెలిపారు.
నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నవారిలో కొంతమంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి నకిలీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసినవారిలో 127 మందిని ఇప్పటికే గుర్తించామని పోలీసులు వెల్లడించారు. వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.
వివిధ విద్యాసంస్థల పేరుతో ఇప్పటికే ఈ ముఠా 665 నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాకతీయ వర్సిటీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్వేశ్ అని పోలీసులు గుర్తించారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు.
వరంగల్ టాస్క్‌ఫోర్స్, హసన్‌పర్తి పోలీసులు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 88 నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు, 4 స్టాంపులు, హోలోగ్రామ్‌లు, 16 మొబైల్ ఫోన్లు, కలర్ ప్రింటర్, సీపీయూ, రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసినవారిలో వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆకుల రవి అలియాస్ అజయ్(33), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లంకల శంకర్‌రావు(46), హనుమకొండకు చెందిన మీర్జా అక్తర్ అలీ బేగ్(31), హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సుడిగ ఎల్లేష్(48), రామంతాపూర్‌కు చెందిన ముప్పరి పురుషోత్తం(40), కామన్ ప్రీతం(31), ఐనవోలు సాయి శ్రవణ్(26), గుంటూరుకు చెందిన కోట అశోక్(30), మనోజ్‌సింగ్(25), నల్గొండకు చెందిన గండికొంట సందీప్(26), వనపర్తికి చెందిన తల్లూరి సంప్రీత్(26), చిమరాల లక్ష్మీప్రసాద్(26) ఉన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.