మరింత మందికి పథకాలు.. మార్పులపై అధ్యయనానికి అత్యున్నత కమిటీ!
ప్రస్తుతం అమలులో ఉన్న పలు పథకాల్లో మార్పులు చేసి ఎక్కువ మందికి లబ్ది చేకూర్చేలా రూపొందించడానికి ఒక అత్యున్నత కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పార్టీని మరో సారి గెలిపించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతంగా జరగాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆయన భావిస్తున్నారు. 2014లో ఉద్యమ పార్టీగా విజయం సాధించినా.. 2018లో మాత్రం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేసిన పథకాలు ఓట్లు రాల్చాయని ఒక అంచనాకు వచ్చారు. ఇక 2023లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలంటే ఇప్పుడున్న పథకాలను మరింత మందికి చేరువ చేయడంతో పాటు, కొత్త వాటిని కూడా ప్రవేశపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న పలు పథకాల్లో మార్పులు చేసి ఎక్కువ మందికి లబ్ది చేకూర్చేలా రూపొందించడానికి ఒక అత్యున్నత కమిటీని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ బి. వినోద్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనచారి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పథకాలన్నింటినీ మరోసారి పరిశీలించి.. ఎలాంటి మార్పులు చేస్తే లబ్దిదారులకు మరింత చేరువ కావొచ్చో వారు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నారు. అలాగే ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం చేయగలిగేలా పథకాలను మరింత మెరుగు పరిచే సూచనలు కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలు గత ఐదారేళ్లుగా అమలులో ఉన్నాయి. వాటిని మోడిఫై చేసి మరింత మంది ఓటర్లను ఆకట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 450 సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తోంది. ఇందు కోసం ఏడాదికి రూ.90వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు పార్టీ చెబుతోంది. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, డబుల్ బెడ్రూం స్కీమ్, రూ.1కి కిలో బియ్యం వంటి పథకాలు బీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి రావడానికి కారణమయ్యాయని పార్టీ అధిష్టానం అంచనా వేసింది. పైన పేర్కొన్న పథకాల్లో రైతు బంధు, రైతు బీమా తప్ప మిగిలినవి అన్నీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అమలు చేస్తున్నారు.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి నాలుగు నెలల ముందు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారు. ఈ రెండు పథకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కాగా, కొన్ని వర్గాల రైతులకు రైతు బంధు అమలు కావడం లేదని, అలాగే భూమి ఎక్కువగా ఉన్న బడా రైతులు రూ.లక్షల్లో లబ్ది పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ లోపాలను సరి చేసి మరింత సమర్థవంతంగా ఎలా అమలు చేయలో అత్యున్నత కమిటీ సూచనలు చేయనున్నట్లు తెలుస్తున్నది. అలాగే కొన్ని పాత పథకాల స్థానంలో మరింత సమర్ధవంతమైన కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రంలో అమలు అవుతున్న ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నా.. అది బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని ఆరోగ్యశ్రీ కార్డులను అనుమతించక పోవడం.. కాలేజీలు విద్యార్థులను ఫీజుల కోసం వేధించడం వల్ల ఈ పథకాలు పలు విమర్శలను తెచ్చిపెడుతున్నాయి. దీనిపై కూడా అత్యున్నత కమిటీ నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతం అమలు అవుతున్న పథకాలన్నింటిపై అధ్యయనం చేసి.. ఒక నెలలోగా నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తున్నది.