రూ.10వేల కోట్లతో మూసీ నది పొడవునా.. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు ఎక్స్‌ప్రెస్ వే : మంత్రి కేటీఆర్
మంచిరేవుల నుంచి నాగోల్ వరకు నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం రూ.10 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచానా వేశాం. మూసీ సుందరీకరణలో భాగంగా దీన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. నగరంలో ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది. అందుకే నగర అవసరాలను దృష్టితో పెట్టుకొని మూసీ నది పొడవునా ఒక ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని నిర్ణయించాం. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు నిర్మించనున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం రూ.10 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచానా వేశాం. మూసీ సుందరీకరణలో భాగంగా దీన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద నిర్మించిన ఇంటర్ ఛేంజ్‌ను శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
మూసీ సుందరీకరణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని చెప్పారు. కరోనా కారణంగా మూసీ పనులు రెండేళ్ల పాటు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. మూసీపైన 15 బ్రిడ్జీలు రాబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 5 బ్రిడ్జీల టెండర్లు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు. మిగిలిన బ్రిడ్జీలకు కూడా టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. మూసీపైనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో స్కైవాక్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి..
నగరంలోని అత్తాపూర్ దగ్గర స్కై బ్రిడ్జి నిర్మించాలని భావించాం. కానీ అక్కడ రక్షణ శాఖకు చెందిన భూముల వల్ల ఆటంకం ఏర్పడుతోంది. దాదాపు ఒక ఎకరం భూమిని రక్షణ శాఖ బదలాయిస్తే స్కై వాక్ నిర్మాణం పూర్తి చేయవచ్చు. ఇదే విషయాన్ని మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్ద ప్రస్తావించాను. అలాగే త్వరలో ప్రధాని మోడీ తెలంగాణ వస్తున్నట్లు తెలిసింది. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మన్నించాలని కేటీఆర్ కోరారు.
జేబీఎస్ నుంచి షామీర్‌పేట వరకు స్కై వాక్‌తో పాటు మెట్రోను విస్తరించాలని భావిస్తున్నాం. ఇందు కోసం కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ భూములు అవసరం అవుతాయి. దాదాపు 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తే.. మెట్రోను అక్కడి వరకు విస్తరించే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ ఒక తీపి కబురు చెప్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలోనే మొట్టమొదటి నగరం హైదరాబాద్..
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగు నీటిని శుద్ధి చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీ) ఏర్పాటు చేస్తున్నాం. సెప్టెంబర్ చివరి నాటికి 100 శాతం ఎస్టీపీలు ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రోజు కోకాపేటలో ఒక ఎస్టీపీని ప్రారంభించనున్నాం. నిర్మాణ దశలో ఉన్న మిగిలిన ప్లాంట్లు కూడా త్వరలోనే సిద్ధం అవుతాయని మంత్రి చెప్పారు.
సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లలో శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగంలో ఉపయోగించుకునేలా నిబంధనలు తీసుకొని వస్తాం. ఆ నీటితో నిర్మాణాలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు కూడా సూచిస్తున్నాం. అలా చేయడం వల్ల మంచి నీటిని ఆదా చేసిన వాళ్లం అవుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరం 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకొని వెళ్తామని కేటీఆర్ వెల్లడించారు.