దసరా రోజు కాంగ్రెస్ మోసాలను వివరించండి
యువతకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు
దసరా పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్తున్న యువత కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను తమ వారికి వివరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో భవిషత్ బాగు పడుతుందని నమ్మిన మీరు నిరుడు దసరా పండుగకు గ్రామాలకు వెళ్లినప్పుడు అప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోగా అవ్వాతాతలకు పింఛన్ పెంచలేదు.. రుణమాఫీ పూర్తి చేయలేదు.. రైతుబంధు నిలిపివేశారు.. రైతుభరోసాకు దిక్కులేదు.. వడ్లకు ఇస్తామన్న బోనస్ ను బోగస్ చేశారు.. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 10 నెలలవుతున్నా అతీగతీ లేదు.. నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి నీళ్లొదిలారు.. ఈ విషయాలన్ని దసరా రోజు మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అలాయ్ - బలాయ్ తీసుకునే సమయంలో వివరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ లు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు.