కరెంటు ఛార్జీల పెంపు తప్పదా.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ..!
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరెంటు ఛార్జీల సవరణ చేయాలంటే అంతకుముందే నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్సీకి ARR ప్రతిపాదనలు పంపించాలి.
తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెంచడమా.. లేదా అనే విషయంలో కొత్త ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఛార్జీల పెంపునకు.. ప్రభుత్వం అంగీకరించకపోతే దాదాపు రూ.26 వేల కోట్లు బడ్జెట్‌లో విద్యుత్ పంపిణీ సంస్థలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ అంశంపై ఈ నెల 31లోగా యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ - ARR నివేదిక సమర్పించాలని ERC డిస్కంలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాదిలో డిస్కంలకు వివిధ రాయితీలు, అప్పుల కిస్తీల చెల్లింపుల కోసం రూ.11 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అవి చాలకపోవడంతో ఆదాయ, వ్యయాల మధ్య లోటు నెలకు రూ.1386 కోట్లకు పెరిగిందని డిస్కంలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీలతో పాటు లోటు కలిపి రూ.26 వేల కోట్లు అవసరమని లెక్క తేలింది.
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరెంటు ఛార్జీల సవరణ చేయాలంటే అంతకుముందే నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్సీకి ARR ప్రతిపాదనలు పంపించాలి. గత నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు సమర్పించకుండా నిలిపేసింది. దీంతో డిస్కంలు సైతం ARR నివేదిక సమర్పించేందుకు ఈ ఏడాది జనవరి 2 వరకు గడువు తీసుకున్నాయి. ఈ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ నెల 31లోగా ఏఆర్‌ఆర్ సమర్పించాలని లేకపోతే ఫిబ్రవరి ఒకటి నుంచి జరిమానా విధిస్తామని డిస్కంలను ఈఆర్‌సీ హెచ్చరించింది. ఈ నివేదిక ఇచ్చిన 120 రోజుల్లోగా వాటిపై ఈఆర్‌సీ విచారణ జరిపి ఛార్జీల సవరణకు మార్చి 31లోగా తీర్పు చెబుతుంది.
దీని ఆధారంగానే ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలను పెంచే అధికారం డిస్కంలకు వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగి ARR ప్రతిపాదనలు సమర్పించాలని తాజాగా డిస్కంలు నిర్ణయించాయి. విద్యుత్ సంస్థలు ఇప్పటికే రూ.18 వేల కోట్ల అప్పుల్లో, మరో రూ.50 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉండడంతో కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.