Telugu Global
Telangana

డబ్బు తరలిస్తున్న ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్

సాధారణ పౌరులను తనిఖీల పేరుతో పోలీసులు పట్టి పట్టి చూస్తున్నా.. ప్రెస్, పోలీస్ అనే స్టిక్కర్లు ఉన్న వాహనాలకు మాత్రం కొంత మినహాయింపు ఉంటుంది. దీంతో ఎక్సైజ్ సీఐ తన వాహనంలోనే నగదు తరలించే ప్రయత్నం చేశారు.

డబ్బు తరలిస్తున్న ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసి ప్రలోభ పర్వం మొదలైంది. ఈసారి పోలీస్ బలగాలు పగడ్బందీగా తనిఖీలు చేస్తుండే సరికి అభ్యర్థులకు డబ్బుల పంపిణీ తలకు మించిన భారంగా మారింది. ఇప్పటికే కోట్ల రూపాయల నగదు పోలీస్ తనిఖీల్లో పట్టుబడింది. కొన్ని చోట్ల రెడ్ హ్యాండెడ్ గా చోటా నాయకులు పోలీసులకు చిక్కారు. రేపు పోలింగ్ కావడంతో ఈరోజు ఎలాగైనా డబ్బుల పంపిణీ పూర్తిచేయాలని డిసైడ్ అయ్యారు నాయకులు. రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా డబ్బు సంచులతో దొరికిన ఎక్సైజ్ సీఐ వ్యవహారం సంచలనంగా మారింది. ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.

మేడ్చల్‌ లోని మేడిపల్లి మండలం చెంగిచర్లలో ఎస్వీఎం హోటల్ నుంచి కారులో డబ్బు కట్టలతో బయలుదేరాడు ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు. ఈ డబ్బులు మీవంటే మీవంటూ రెండు పార్టీలు వాదనలు చేసుకోవడం విశేషం. అయితే ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడకు చేరవేస్తున్నారనే విషయాలపై విచారణ జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో లెక్క చూపని డబ్బుతో బయలుదేరిన ఎక్సైజ్ సీఐ మాత్రం ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

సాధారణ పౌరులను తనిఖీల పేరుతో పోలీసులు పట్టి పట్టి చూస్తున్నా.. ప్రెస్, పోలీస్ అనే స్టిక్కర్లు ఉన్న వాహనాలకు మాత్రం కొంత మినహాయింపు ఉంటుంది. దీంతో ఎక్సైజ్ సీఐ తన వాహనంలోనే నగదు తరలించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు కొందరు కారుని వెంబడించారు. అడ్డుకున్నారు. చివరకు పోలీసులు వచ్చి తనిఖీలు చేపట్టగా రూ.6లక్షల నగదు బయటపడింది. దీంతో అంజిత్ రావుని సస్పెండ్ చేశారు.

First Published:  29 Nov 2023 10:11 AM IST
Next Story