Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. నాకు చెప్పకుండానే చేరికలా అంటూరేణుకా చౌదరి ఫైర్!

కాంగ్రెస్‌లోకి కీలక నేతలు వస్తున్నారని భావిస్తున్న సమయంలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తన అసంతృప్తిని బయటపెట్టారు.

కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. నాకు చెప్పకుండానే చేరికలా అంటూరేణుకా చౌదరి ఫైర్!
X

అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎలాంటి మార్పు ఉండని పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకి తగినట్లే నాయకులు కూడా ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మాత్రం అంతకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ బహిరంగంగా సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం.. గ్రూపులు కట్టి గొడవలు పెట్టుకోవడం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపింది. అప్పటి వరకు దూకుడుగా ఉన్న బీజేపీని కూడా వెనక్కు నెట్టి.. బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనేలా ప్రజల్లోకి వెళ్తున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇతర పార్టీలకు వలస వెళ్లిన నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లిని పార్టీలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించి, సఫలం అయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఆ వారిద్దరూ తమ అనుచరులతో కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తున్నది.

కాంగ్రెస్‌లోకి కీలక నేతలు వస్తున్నారని భావిస్తున్న సమయంలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తన అసంతృప్తిని బయటపెట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన నాకు తెలియకుండా అక్కడి నాయకులను ఎలా చేర్చుకుంటారని ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు కేసీ. వేణుగోపాల్‌ను కూడా కలిసి.. ఖమ్మం రాజకీయ వ్యవహారాలపై ఫిర్యాదు చేశారు. ఆమె వెంట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా ఉండటం గమనార్హం.

ఖమ్మం కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో రేణుక చౌదరి, మల్లు భట్టి విక్రమార్క మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ రేణుక, భట్టి వర్గాలుగా విడిపోయింది. రేణుకా చౌదరి గతంలో ఖమ్మం ఎంపీగా పని చేశారు. 1999, 2004లో వరుసగా ఖమ్మం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 2009, 2019లో మాత్రం ఓటమిపాలయ్యారు. రెండున్నర దశాబ్దాలుగా ఖమ్మంలో రేణుక వర్గం గట్టిగానే పాతుకొని పోయింది. అదే సమయంలో జిల్లాలోని మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క వరుసగా మూడు సార్లు గెలిచారు. జిల్లా కాంగ్రెస్‌కు ప్రస్తుతం వీరిద్దరే పెద్ద దిక్కుగా ఉన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేణుక, భట్టి వర్గం మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అయితే, భట్టి విక్రమార్క కాంగ్రెస్ సీఎల్పీ లీడర్‌గా నాయకులు, కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నది ఒక రకంగా మల్లు భట్టి విక్రమార్కే అని కార్యకర్తలు చెబుతారు. రేణుక చౌదరి మాత్రం గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి జిల్లా మొఖం చూడలేదు. కనీసం పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయలేదని కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్న సమయంలో.. రేణుక తిరిగి తన పాలిటిక్స్ చూపించడంపై గుర్రు మంటున్నారు.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా భట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉంటున్నారు. తాజాగా ఆయన పాదయాత్రకు వెళ్లి పొంగులేటి చర్చించారు. ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి కీలక నేతగా మారతారని భావిస్తున్న సమయంలో.. రేణుక చౌదరి ఎంట్రీ ఇచ్చారు. తనకు తెలియకుండా పొంగులేటికి ఎలా ఆహ్వానం పలుకుతారని ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు.

గత కొంత కాలంగా భట్టి వర్గం నాయకులు తమ వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె మల్లిఖార్జున్ ఖర్గేకు చెప్పినట్లు సమాచారం. పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేపు భట్టి, పొంగులేటి ఏకమైతే.. ఉమ్మడి జిల్లాలో తన వర్గానికి ఇబ్బందులు ఎక్కువవుతాయని కూడా చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే.. ఈ విషయంపై అధిష్టానం నుంచి రేణుకకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదని తెలుస్తున్నది. పొంగులేటి చేరిక దాదాపు ఖాయమైందని.. అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.

First Published:  23 Jun 2023 3:29 PM IST
Next Story