నన్ను బుజ్జగించండి సార్ ప్లీజ్.. కేసీఆర్ కోసం ఢిల్లీలో 'బూర' ఎదురు చూపులు
కేసీఆర్ నుంచి ఎప్పుడు పిలుపొస్తుందా అని రెండు రోజులుగా ఢిల్లీలోనే నర్సయ్య గౌడ్ పడిగాపులు కాస్తున్నారు. అయినా పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బూరను ఇబ్బందికి గురి చేస్తోంది.
ఎన్నికల్లో టికెట్ ఆశించి.. దక్కని వారికి అసంతృప్తి ఉండటం సహజమే. కొంత మంది భవిష్యత్‌లో పార్టీ మళ్లీ అవకాశం ఇస్తుందని సర్థుకుంటారు. మరి కొంత మంది మాత్రం పార్టీ మారతాం, రెబల్‌గా నామినేషన్ వేస్తామని బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతుంటారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఇలాంటి అభ్యర్థులు ఒకరో ఇద్దరూ ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కూడా బూర నర్సయ్య గౌడ్ రూపంలో ఒక తలనొప్పి మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ఆయన టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఆయనతో పాటు కర్నె ప్రభాకర్ వంటి బీసీ నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ కేటాయించారు.
బూర నర్సయ్య గౌడ్ గత సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అప్పటికి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉండటంతో బూరకే టికెట్ కేటాయించారు. ఎవరి నియోజకవర్గాల్లో వారికే కేసీఆర్ టికెట్ కేటాయిస్తూ వస్తున్నా.. అనసవరంగా ఆశలు పెంచకున్న నర్సయ్య గౌడ్ ఇప్పుడు అసంతృప్తికి గురయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాను బీజేపీలోకి మారిపోతానని మీడియాకు లీకులు ఇచ్చారు. అంతే కాకుండా అనుచరులను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న బూర నర్సయ్య గౌడ్ ఇంత వరకు బీజేపీలో చేరింది లేదు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో కలసి బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్‌ను కలిశారని వార్తలు వచ్చాయి. కానీ తరుణ్ చుగ్ మాత్రం బూర నర్సయ్య గౌడ్ అసలు తనను కలవలేదని తేల్చి పారేశారు. తెలంగాణ ఇంచార్జే బూరను కలవక పోతే.. మరి కలిసిన బీజేపీ అగ్రనాయకులు ఎవరనే చర్చ జరుగుతోంది. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు కేసీఆర్ నుంచి పిలుపొస్తుందని బూర నర్సయ్య గౌడ్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
కేసీఆర్ తనను పిలిచి బుజ్జగిస్తారని.. అప్పుడు టీఆర్ఎస్‌లోనే కొనసాగాలని బూర అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నుంచి ఎప్పుడు పిలుపొస్తుందా అని రెండు రోజులుగా ఢిల్లీలోనే నర్సయ్య గౌడ్ పడిగాపులు కాస్తున్నారు. అయినా పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బూరను ఇబ్బందికి గురి చేస్తోంది. తనను ఎవరూ బుజ్జగించకపోతే.. ఇక బీజేపీలో చేరిపోదాం అని అనుకుంటున్నట్లు సమాచారం. అసలు బూర ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ మారాలనుకుంటే నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోవచ్చుకదా.. ఢిల్లీ వరకు వచ్చి కేసీఆర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలని.. ఎవరెన్ని చేసినా మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు.