అవకాశమిచ్చారు.. కృతజ్ఞతలు.. కేసీఆర్‌కు ఆరూరి రాజీనామా లేఖ
ప్రస్తుతం బీజేపీ తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం అయిన వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి బరిలో ఉండనున్నారు.
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సస్పెన్స్‌కు తెరదించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆరూరి.
ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనలో అమిత్ షాను కలిసి సీటు విషయమై హామీ తీసుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటు హామీతోనే ఆ పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం అయిన వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి బరిలో ఉండనున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా ఆరూరి బీజేపీ చేరిక విషయంలో హైడ్రామా కొనసాగింది. మొదట బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం రాగా.. స్వయంగా ఆయనే ఆ విషయాన్ని ఖండించారు. మళ్లీ రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఆరూరి అమిత్ షాను కలిశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా ప్రకటన చేసేందుకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయగా.. ఆయనను వరంగల్ బీఆర్ఎస్ నేతలు బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చారు. మార్గమధ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ కూడా జరిగింది. అనంతరం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన వరంగల్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. తాను పార్టీ మారబోనని, బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు ఆరూరి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ లేఖను కేసీఆర్‌కు పంపారు ఆరూరి.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచారు ఆరూరి రమేష్. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఆర్.నాగరాజు చేతిలో ఓడిపోయారు. వరంగల్ పార్లమెంట్ సీటుపై బీజేపీ నుంచి హామీ రావడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటును కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించింది బీఆర్ఎస్.