తుమ్మల కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..?
2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వంలో పాటు పార్టీలో కూడా ప్రాధానత్య తగ్గిపోయింది. ఇదే సమయంలో ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ మంత్రి అవటంతో జిల్లాలో తుమ్మల పరిస్థితి మరీ అన్యాయమైపోయింది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. తాను తీసుకోబోయే నిర్ణయానికి నేతలు, క్యాడర్ ఆమోదం కోసమే ఆదివారం భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. వచ్చేఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల ఇండిపెండెంట్ గా పోటీచేసే అవకాశముంది. తుమ్మల ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నా పెద్దగా ప్రాధాన్యత లేదన్న విషయం అందరికీ తెలుసు.
2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వంలో పాటు పార్టీలో కూడా ప్రాధానత్య తగ్గిపోయింది. ఇదే సమయంలో ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ మంత్రి అవటంతో జిల్లాలో తుమ్మల పరిస్థితి మరీ అన్యాయమైపోయింది. ఏదో లేస్తే మనిషిని కాదన్నట్లుగా తుమ్మల నెట్టుకొస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఈయన పరిస్థితిని గమనించిన తర్వాత కాంగ్రెస్, బీజేపీల్లో చేరమని పై రెండుపార్టీల నేతలు బాగా ఒత్తిళ్ళు తెస్తున్నారు. అయితే రెండు పార్టీల భవిష్యత్తుపైన తుమ్మలకు పెద్దగా నమ్మకంలేదు.
అంతర్గత వివాదాలతో కాంగ్రెస్ నేతలు కుమ్ములాడుకుంటుంటే బీజేపీకి అంత సీన్ లేదని తుమ్మల భావన. పై రెండుపార్టీల్లో దేనిలో చేరినా తుమ్మల కోరుకున్న నియోజకవర్గంలో పోటీకి ఢోకా ఉండదు. అయితే ఈయన మనసంతా పాలేరులో బీఆర్ఎస్ తరపున పోటీచేయటంపైనే ఉంది. కానీ అందుకు అవకాశాలు దాదాపు లేవనేచెప్పాలి. ఎందుకంటే వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు కారణంగా తానే పోటీచేయబోతున్నట్లు సీపీఎం అగ్రనేత తమ్మినేని వీరభద్రం పాలేరులో ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తుమ్మలను ఇండిపెండెంట్ గా పోటీచేయమని మద్దతుదారులు బాగా ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు తమ్మినేని, మరోవైపు వైఎస్ షర్మిల, అలాగే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు పోటీచేయటం ఖాయం. ఇంతమంది పోటీచేసినప్పుడు గట్టిగా పనిచేసి 30 వేల ఓట్లు తెచ్చుకుంటే తుమ్మల ఇండిపెండెంటుగా గెలవటం ఖాయమని మద్దతుదారులు పదేపదే చెబుతున్నారు. ఈ విషయంలో తుమ్మల కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో సర్వే కూడా చేయించుకుంటున్నారట. చివరకు ఏమవుతుందో చూడాలి.