Telugu Global
Telangana

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు?

తుమ్మలకు గతంలో కేసీఆర్‌కు ఉన్న బలమైన సంబంధాలు సన్నగిల్లాయి. కేవలం ఖమ్మం, పాలేరుకు మాత్రమే పరిమితం అయిన తుమ్మల.. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు.

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు?
X

టీఆర్ఎస్ పార్టీని మరో సీనియర్ నాయకుడు వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఖమ్మం టీడీపీలో తిరుగులేని నాయకుడిగా, మంత్రిగా పని చేసిన తుమ్మల నాగేశ్వరరావు.. 2014లో టీఆర్ఎస్‌లో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్‌తో తుమ్మలకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో 2014లో పార్టీలో చేరగానే ఎమ్మెల్సీని చేయడంతో పాటు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. 2016లో పాలేరుకు వచ్చిన ఉపఎన్నికలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తుమ్మల గెలిచారు. అప్పట్లో ఖమ్మం టీఆర్ఎస్‌లో తుమ్మలదే హవా నడిచింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో తుమ్మల ఎలాంటి అధికారాన్ని అనుభవించారో.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత కూడా తుమ్మల హవా అలా కొనసాగింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి తుమ్మల ప్రభకు చెక్ పడింది. కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు పాలిటిక్స్‌లో పూర్తిగా ఆధిపత్యం సాధించారు. అంతే కాకుండా కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా టీఆర్ఎస్‌లో చేరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే టీఆర్ఎస్ టికెట్ వస్తుందని కందాల ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పట్టు సాధించిన కందాల.. తుమ్మల వర్గానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు. తుమ్మలకు కూడా గతంలో కేసీఆర్‌కు ఉన్న బలమైన సంబంధాలు సన్నగిల్లాయి. కేవలం ఖమ్మం, పాలేరుకు మాత్రమే పరిమితం అయిన తుమ్మల.. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు.

ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా ఊరూరా జెండా పండుగ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి కూడా తుమ్మల దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం 'పిడుగు ఎప్పుడైనా పడొచ్చు' అంటూ తన అనుచరుల దగ్గర వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే తుమ్మల పార్టీ మారతారనే ఊహాగానాలు విన్పించాయి. తుమ్మల నాగేశ్వరరావు త్వరలో బీజేపీలో చేరతానికి కూడా వార్తలు వచ్చాయి. అయితే, జిల్లా రాజకీయాలు బేరీజు వేసుకున్న తుమ్మల కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందని అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులకు మంచి పట్టు ఉన్నది. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ కూడా ఉమ్మడి జిల్లాలో గత ఎనిమిదేళ్లలో మూడు సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోలేక పోయింది. 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, 2016 పాలేరు ఉపఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ తప్ప టీఆర్ఎస్‌కు ఇక్కడ విజయాలు లభించలేదు. ఇక బీజేపీకి అయితే జిల్లాలో చోటే లేదు. ఇక్కడ బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకక పోవడంతో తుమ్మల, పొంగులేటి వంటి నాయకులను పార్టీలోకి విశ్వప్రయత్నాలు చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఏ మాత్రం ఓటు బ్యాంకు, కార్యకర్తలు లేని పార్టీలోకి వెళ్లినా తాము చేసేది ఏమీ ఉండదని వాళ్లు గ్రహించారు.

పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఇక్కడి నుంచి గెలిచారు. 2016 ఉపఎన్నికలో తప్ప టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. అప్పట్లో తుమ్మల నాగేశ్వరరావు పోటీలో ఉండటం, ఆయన మంత్రి హోదాలో బరిలోకి దిగడంతో గెలిచారనే చర్చ జరిగింది. ఆ తర్వాత 2018లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థే పాలేరు నుంచి గెలిచరు. ఈ సారి టీఆర్ఎస్ టికెట్ తనకు వచ్చే అవకాశం లేదని తుమ్మల భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే తప్పకుండా టికెట్ వస్తుందని భావిస్తున్నారు. గతంలో టీడీపీలో కలిసి పని చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాబట్టి తనకు పార్టీలో మంచి ప్రాధాన్యతే దక్కుతుందని భావిస్తున్నారు. ఆయన చేరితే పాలేరు టికెట్ కేటాయించడానికి కూడా కాంగ్రెస్‌లో పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. మొత్తానికి టీడీపీతో రాజకీయం ప్రారంభించిన తుమ్మల.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండటం ఖమ్మం రాజకీయాల్లో పెను మార్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  13 Oct 2022 11:10 AM GMT
Next Story