Telugu Global
Telangana

ఆంధ్రాలో పెళ్లికి తెలంగాణలో పందిరి ఎందుకు..?

రెండు రాష్ట్రాల మధ్య అప‌రిష్కృత అంశాల మీద చ‌ర్చించాలనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవన్నారు నిరంజన్ రెడ్డి. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవని, ప‌రోక్షంగా తెలంగాణ‌ను ప‌రిపాలించేందుకు కుట్ర మొదలైందన్నారు.

ఆంధ్రాలో పెళ్లికి తెలంగాణలో పందిరి ఎందుకు..?
X

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీపై సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. చంద్ర‌బాబు ఆంధ్రాలో సీఎం అయ్యారని, దానికి తెలంగాణ రాజ‌ధానిలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావ‌డం లేదన్నారు. పెళ్లికొడుకు ఒక‌చోట‌.. పెళ్లి ఒక‌చోట‌.. పందిరి మాత్రం తెలంగాణ‌లో ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రాలో పెళ్లికి హైదరాబాద్ లో ఆర్భాటం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారన్నారు నిరంజన్ రెడ్డి.


రెండు రాష్ట్రాల మధ్య అప‌రిష్కృత అంశాల మీద చ‌ర్చ అనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవన్నారు నిరంజన్ రెడ్డి. కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవని, ప‌రోక్షంగా తెలంగాణ‌ను ప‌రిపాలించేలా కుట్ర మొదలైందన్నారాయన. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు నిరంజన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత గ‌త ప‌దేళ్లుగా ఎవ‌రి మానాన వారు బ‌తుకుతున్నారని, మానిన గాయాల‌ను మ‌ళ్లీ ర‌గిల్చేందుకు చంద్ర‌బాబు, రేవంత్ క‌లిసి కుట్ర‌లు చేస్తున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వేదిక‌ ఉండ‌డంలో అభ్యంత‌రం లేదని, కానీ చంద్రబాబు రాజ‌కీయ ఆర్భాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి.

స్వల్ప తేడాతోనే..

స్వల్ప ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు నిరంజన్ రెడ్డి. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన సవ్యంగా లేదని విమర్శించారు. ప్ర‌జ‌లు స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వినేందుకు కూడా ఆసక్తి చూపించడంలేదని, టీజీపీఎస్సీ వద్ద కంచెలు వేయడం దుర్మార్గం అని అన్నారాయన. రోడ్డుపైన పోయేవారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఇలాంటి జిమ్మిక్కులన్నీ మానేసి హామీల అమలుపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవుపలికారు నిరంజన్ రెడ్డి.

First Published:  6 July 2024 3:36 PM IST
Next Story