71 ఏళ్ల వయసులో రిస్క్ చేస్తానా..? - మల్లారెడ్డి
తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసి ఇక విశ్రమిస్తానని చెప్పారు మల్లారెడ్డి. రాజకీయాల నుంచి తప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేత, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి మీడియా ముందుకొచ్చారు. తాను పార్టీ మారేది లేదని, బీఆర్ఎస్ ని వీడేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. 71 ఏళ్ల వయసులో తాను పార్టీ మారే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, తన కుటుంబ సభ్యులు కూడా వేరే పార్టీల నుంచి పోటీ చేయరని చెప్పుకొచ్చారు. పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తల్ని మల్లారెడ్డి ఖండించారు.
ఇక నో ఎలక్షన్స్..
తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసి ఇక విశ్రమిస్తానని చెప్పారు మల్లారెడ్డి. రాజకీయాల నుంచి తప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయబోనని అన్నారు. సడన్ గా ఆయనకు రాజకీయ వైరాగ్యం ఎందుకొచ్చిందో తెలియడం లేదు. అక్రమ కట్టడాలంటూ తన కాలేజీ భవనాలను అధికారులు కూలదోస్తున్న వేళ.. సడన్ గా మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
కాలేజీ భవనాల కూల్చి వేతల సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు మల్లారెడ్డి. గంటల తరబడి చర్చలు జరిగినా ఫలితం లేదు. ఆ తర్వాత కూడా మల్లారెడ్డి తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. మళ్లీ ఇప్పుడు డీకే శివకుమార్ తో కలసిన ఫొటోలు బయటకు రావడంతో మల్లారెడ్డి మళ్లీ మీడియా ముందుకొచ్చారు. ఈసారి తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. డీకేతో మీటింగ్ రెండు రోజుల క్రితం జరిగిందని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.