Telugu Global
Telangana

కాలేజీలో కూల్చివేతలు, మల్లారెడ్డి సైలెన్స్.. అసలేం జరుగుతోంది..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విద్యాసంస్థల్ని నాశనం చేస్తారా అంటూ మండిపడుతున్నారు, వెంటనే కూల్చవేతలు ఆపాలని డిమాండ్ చేశారు.

కాలేజీలో కూల్చివేతలు, మల్లారెడ్డి సైలెన్స్.. అసలేం జరుగుతోంది..?
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందిన కాలేజీలో కూల్చివేతలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలనే ఆరోపణలు వినిపించడం సహజం. కానీ ఇక్కడ మల్లారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. విద్యాసంస్థల అధినేత, ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం తక్కువ మోతాదులో స్పందించారు. కాలేజీ నిర్మాణంలో అక్రమాలు జరగలేదని, వెంటనే కూల్చివేతలు ఆపేయాలని కోరారు. ఆయన కూడా ఎక్కడా ప్రభుత్వాన్ని నిందించలేదు, కాంగ్రెస్ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టలేదు.

ఏం జరుగుతోంది..?

కూల్చివేతలు మొదలు కాగానే.. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. దాదాపు మూడు గంటలపాటు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి స్పందించారు, విద్యాసంస్థ ఫౌండర్‌, చైర్మన్‌ హోదాలోనే తాము వేం నరేందర్‌రెడ్డిని కలిశామని, దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. కానీ మల్లారెడ్డి మీడియాకు అందుబాటులో లేరు. ఈలోగా సోషల్ మీడియాలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి.

మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ టికెట్ పై తన కొడుకుని బరిలో దింపేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే పుకార్లు కొన్నిరోజుల క్రితమే వినిపించాయి. మల్లారెడ్డి ఆ వార్తల్ని ఖండించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ మీటింగుల్లో కనిపించారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కూడా. మళ్లీ ఇప్పుడు కాలేజీలో కూల్చివేతలు మొదలవగానే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుని కలవడంతో కలకలం రేగింది. అందులోనూ మల్లారెడ్డి మీడియా ముందుకు రాలేదు. ఆయన అల్లుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. రాగా పోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విద్యాసంస్థల్ని నాశనం చేస్తారా అంటూ మండిపడుతున్నారు, వెంటనే కూల్చవేతలు ఆపాలని డిమాండ్ చేశారు. సదరు నిర్మాణాలు అక్రమమా..? సక్రమమా..? అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు మల్లారెడ్డి దారెటు..? అనేది చర్చనీయాంశంగా మారింది.

First Published:  8 March 2024 6:55 AM IST
Next Story