Telugu Global
Telangana

జూపల్లి ఘర్‌వాపసీ.. కాంగ్రెస్ గూటికి చేరనున్న మాజీ మంత్రి?

వైఎస్ చనిపోయిన తర్వాత కొంత కాలం కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో పని చేసి.. ఆ తర్వాత రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఉపఎన్నికలో కూడా జూపల్లి మంచి మెజార్టీతో గెలుపొందారు.

జూపల్లి ఘర్‌వాపసీ.. కాంగ్రెస్ గూటికి చేరనున్న మాజీ మంత్రి?
X

మాజీ మంత్రి, వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉన్న జూపల్లి కృష్ణారావు తిరిగి సొంత గూటికి చేరే అవకాశం ఉన్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఉన్న జూపల్లి.. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో పొమ్మనలేక పొగపెట్టినట్లు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయనను రాజకీయంగా టార్గెట్ చేశారు. అటు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి కూడా జూపల్లికి సరైన భరోసా లేకపోవడం, రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని కష్టాలు ముసరడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. 1999లో తొలి సారిగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఓటమే ఎరుగని జూపల్లి.. 2018 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.

వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన జూపల్లి.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ వైఎస్ ఎప్పుడైనా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా జూపల్లి మాత్రం ఆ మాటలను ఖండిచేవారు కాదు. దీంతో జూపల్లి తెలంగాణ వ్యతిరేకి అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత కొంత కాలం కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో పని చేసి.. ఆ తర్వాత రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఉపఎన్నికలో కూడా జూపల్లి మంచి మెజార్టీతో గెలుపొందారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవజ్ఞడైన జూపల్లికి మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. 2018లో కూడా కొల్లాపూర్ టికెట్ జూపల్లికే కేటాయించారు. కానీ, పార్టీలో ఉన్న విభేదాల కారణంగా ఆయన ఓడిపోయారు.

2018లో జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి జూపల్లి సంకట స్థితిలో పడ్డారు. అప్పటికే నియోజకవర్గంలో ఉన్న గొడవలు, మంత్రి కేటీఆర్‌తో ఉన్న విభేదాలకు తోడు.. ఎమ్మెల్యే బీరంతో వైరం జూపల్లిని ఊపిరి తీసుకోలేనంతగా ఇబ్బంది పెట్టింది. ఇటీవల కొల్లాపూర్‌లో జూపల్లి వర్సెస్ బీరం గొడవ రాష్ట్రమంతటా చర్చనీయాంశం అయ్యింది. సీనియర్ నాయకుడిని, మాజీ మంత్రిని అయిన తనను పూర్తిగా పక్కన పెట్టారని జూపల్లి మదనపడుతున్నారు. తనకు పార్టీలో, నియోజకవర్గంలో జరుగుతున్న అవమానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న జూపల్లి ఇటీవల తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత బీజేపీలో చేరాలని భావించినా.. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగ్ జిల్లాలో జితేందర్ రెడ్డి, డీకే అరుణ వంటి నాయకులు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీలో చేరితే ఓ వర్గం ఓట్లు కోల్పోతామని కూడా జూపల్లి అంచనాకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే తనకు సరైన ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో.. తనకు కాంగ్రెస్‌లో పూర్వవైభవం వస్తుందని జూపల్లి కృష్ణారావు భావిస్తున్నారు. మరోసారి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  12 Oct 2022 10:55 AM IST
Next Story