Telugu Global
Telangana

కేసీఆర్ శిఖరం.. ఆయన ముందు ఇలాంటివి నడవవు

గ్రామాల్లో రైతులంతా ఏకమవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు జగదీష్ రెడ్డి.

కేసీఆర్ శిఖరం.. ఆయన ముందు ఇలాంటివి నడవవు
X

కేసీఆర్ శిఖరం లాంటి వారని, ఆయన ముందు ఇలాంటి చిల్లర వేషాలు నడవవని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య మండిపడ్డారు. అది ముమ్మాటికీ కాంగ్రెస్‌ గూండాలు చేసిన పనేనని విమర్శించారు. ఎంతోమంది రాక్షసులను తరిమికొట్టామని, కాంగ్రెస్ వాళ్లు ఓ లెక్కా అని అన్నారు. రుణమాఫీ విషయంలో అన్నదాతలను కాంగ్రెస్‌ పార్టీ నిట్టనిలువునా మోసం చేసిందన్నారు జగదీష్ రెడ్డి.

రుణమాఫీ విషయంలో ఫ్లాప్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దాడులు మొదలుపెట్టిందని అన్నారు జగదీష్ రెడ్డి. రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతుకోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ కోసం రూ. 40వేల కోట్లు అవుతాయని మేనిఫెస్టోలో చెప్పారని, ఆ తర్వాత రూ. 31వేల కోట్లు అని కేబినెట్‌లో చెప్పారని, ఆ తర్వాత రూ. 27వేల కోట్లకు తగ్గారని, చివరకు రూ. 17వేల కోట్లతో సరిపెట్టారని అన్నారు. దాన్ని కప్పి పుచ్చుకోడానికే సీఎం రేవంత్‌ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి.

రైతులు తిరగబడాలి..

గ్రామాల్లో రైతులంతా ఏకమవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు జగదీష్ రెడ్డి. రైతులు ఒక్కసారి ఆలోచించాలని, కాంగ్రెస్‌ వారిని దగా చేసిందని, మోసం చేసిందని అన్నారు. రేవంత్‌ రెడ్డి బీజేపీతో దొంగ సంబంధాలు పెట్టుకున్నాని అన్నారాయన. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని రేవంత్‌ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్‌ రెడ్డే దొంగలాగా బీజేపీతో మిలాఖత్‌ అయ్యారన్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి.

First Published:  17 Aug 2024 10:11 AM GMT
Next Story