Telugu Global
Telangana

కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేకులు

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు హరీశ్‌రావు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. కొంతమంది పార్టీ వీడిపోతే నష్టమేమీ లేదన్నారు.

కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేకులు
X

కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్‌లు అన్నారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు. పాలన గాలికొదిలేసి అక్రమ కేసులతో టైమ్‌పాస్ చేస్తున్నారని రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారని, వ‌చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు హరీశ్‌రావు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు హరీశ్‌రావు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. కొంతమంది పార్టీ వీడిపోతే నష్టమేమీ లేదన్నారు. పార్టీ వదిలివెళ్లిన‌ వాళ్లు కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా మళ్లీ పార్టీలో చేర్చుకోబోమన్నారు. ఈ భూమి ఉన్నంత కాలం బీఆర్‌ఎస్‌ ఉంటుందని, కార్యకర్తలు అంతా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలన్నారు హరీశ్‌రావు.

కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయన్నారు హరీశ్‌రావు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తాం అని మోసం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలన్నారు హరీశ్‌రావు. క్యామ మల్లేష్ మాస్ లీడర్, భువనగిరిలో తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్వయానా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్‌రావు.

First Published:  3 April 2024 11:21 AM
Next Story