Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కీలక పదవి ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ ముఖ్య సలహాదారుగా నియమించింది.

సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేష్ కుమార్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేష్ కుమార్ మూడేళ్లు కొనసాగుతారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు.

సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ గా ఉన్న ఆయన, తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆయన తెలంగాణ ఆప్షన్ గా పెట్టుకున్నా ఆయన్ను ఏపీకి కేటాయించింది కేంద్రం. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమేష్ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌(CAT)ను ఆశ్రయించారు. CAT సోమేష్ కుమార్ కి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆయన తెలంగాణలోనే కొనసాగారు. మధ్యలో డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DOPT), CAT ఉత్తర్వులపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో ఆయన నియామకాలకు సంబంధించి కీలక ఉత్తర్వులిచ్చింది. సోమేష్ కుమార్ ని ఏపీ కేడర్ కి బదిలీ చేసింది.

ఈ బదిలీ తర్వాత సోమేష్ కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ అయి, ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆయన భవిష్యత్ కార్యాచరణపై చాలా ప్రచారాలు జరిగాయి. రాజకీయాల్లోకి వస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కీలక పదవి ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ ముఖ్య సలహాదారుగా నియమించింది.

First Published:  9 May 2023 5:49 PM IST
Next Story