Telugu Global
Telangana

ఆర్టీవీపై యూరో ఎక్సిమ్ బ్యాంకు పరువునష్టం దావా..

అసత్య కథనాలపై వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే 100 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేస్తామని రవి ప్రకాష్ కి యూరో ఎక్సిమ్ బ్యాంకు నోటీసులిచ్చింది.

ఆర్టీవీపై యూరో ఎక్సిమ్ బ్యాంకు పరువునష్టం దావా..
X

తన క్లయింటు మేఘా ఇంజినీరింగ్ సంస్థపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ ఆర్టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవిప్రకాష్ కు, లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు లీగల్ నోటీసులు జారీ చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పి, సోషల్ మీడియాలో ఆ వార్తల లింకులను తొలగించాలని స్పష్టం చేసింది. అలా తొలగించకపోతే కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది. యూరో ఎక్సిమ్ బ్యాంకు తరపున చెన్నై కు చెందిన అడ్వకేట్ BSV ప్రకాష్ కుమార్ ఆర్టీవీ ఎడిటర్ రవి ప్రకాష్ కు నోటీసులు పంపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియాలో సంచలనంగా మారింది.


ఇటీవల మేఘా ఇంజినీరింగ్ సంస్థను టార్గెట్ చేస్తూ ఆర్టీవీలో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రభుత్వానికి ఇచ్చిన గ్యారెంటీలను తప్పుబట్టేలా ఈ కథనాలున్నాయి. స్వయంగా రవిప్రకాష్ తెరపై కనపడుతూ, తనే వ్యాఖ్యాతగా ఈ కథనాలు ప్రసారం చేశారు. మేఘా ఇంజినీరింగ్ సంస్థ సమర్పించిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ గ్యారెంటీలను దొంగ గ్యారెంటీలని పేర్కొన్నారు. దీంతో యూరో ఎక్సిమ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. ఆర్టీవీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వెంటనే తప్పుడు కథనాల తాలూకు లింకులు తొలగించాలని స్పష్టం చేసింది.

లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంక్ 1900 కోట్ల రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉంది. అయితే ఆర్టీవీ కథనాల్లో ఆ బ్యాంకు వార్షిక టర్నోవర్ ని కేవలం రూ.8కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరో బ్యాంక్.. భారత్ లో పలు ఇన్ ఫ్రా కంపెనీలకు బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తుంది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ తరపున కూడా అలాగే గ్యారెంటీలు ఇచ్చింది. ఈ గ్యారెంటీలపై ఆర్టీవీ ఎడిటర్ రవిప్రకాష్ అనుమానాలు రేకెత్తేలా కథనాలిచ్చారు. అవి దొంగ బ్యాంకు గ్యారెంటీలంటూ తీర్మానించారు. దీంతో యూరో ఎక్సిమ్ బ్యాంక్ నోటీసులు జారి చేసింది. ఈ కథనాలతో తమ బ్యాంక్ కి ఆర్థిక నష్టం వాటిల్లిందని, పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగుల మానసిక స్థైర్యం కూడా దెబ్బతిన్నదని తెలిపింది. అసత్య కథనాలపై వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే 100 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేస్తామని రవి ప్రకాష్ కి బ్యాంక్ నోటీసులిచ్చింది.

First Published:  17 July 2024 5:16 PM GMT
Next Story