కాంగ్రెస్ నేతలతో ఈటల భేటీ.. కండువా మార్చేది ఎప్పుడంటే..?
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల.. తన ఉనికి కాపాడుకోవాలంటే కచ్చితంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. అయితే బీజేపీ తరపున పోటీ చేస్తే గిట్టుబాటయ్యేలా లేదు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీలో తనకు ఆశించిన గౌరవం దక్కలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈటల చెప్పడం, లోక్ సభ ఎన్నికలకోసం బీజేపీలో జరుగుతున్న హడావిడిలో ఆయన పాత్ర లేకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో కండువా మార్పు లాంఛనం అని తేలిపోయింది. కాంగ్రెస్ నేతలతో ఈటల భేటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ విందు భేటీతో ఈటల పార్టీ మార్పు వార్తలకు మరింత బలం చేకూరింది. రాష్ట్ర రాజకీయాలపై చర్చలు జరిగాయని చెబుతున్నా.. ఈటలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకే ఈ విందు భేటీ జరినట్టు సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది.
గతంలో బీఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా.. చివరకు ఆయన బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల భవిష్యత్ పై పునరాలోచనలో పడ్డారు. బీజేపీలో ఆయనకు ఆశించిన గౌరవం దక్కడంలేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాల మధ్య గొడవల్లో ఈటలను పట్టించుకునేవారే కరవయ్యారు. పోనీ తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందా అంటే అదీ లేదు. కేంద్రంలో సంగతేమో కానీ.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి మెరుగుపడేలా లేదు. రాగా పోగా కాంగ్రెస్ కే మంచిరోజులుంటాయనే అంచనాతో ఈటల ఆవైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.
లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా..?
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈటల.. తన ఉనికి కాపాడుకోవాలంటే కచ్చితంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. అయితే బీజేపీ తరపున పోటీ చేస్తే గిట్టుబాటయ్యేలా లేదు. అందుకే కాంగ్రెస్ లో చేరి కరీంనగర్ నుంచి ఈటల పోటీ చేస్తారని అంటున్నారు. మరి ఈటల వ్యూహం ఎలా ఉందో వేచి చూడాలి.