బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు.. ఈటల ఏమన్నారంటే..!
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలకు భ్రమలు తొలగుతున్నాయన్నారు ఈటల రాజేందర్. అమలుకు నోచుకోని హామీలిచ్చి.. అప్పు కావాలని ఢిల్లీలో మోడీ, అమిత్‌షాకు రేవంత్ దండం పెడుతున్నారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్. తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ పట్టలేదన్నారు. సొంత కాళ్లపై నిలబడి పోటీ చేసి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీచేస్తానని మరోసారి ఈటల స్పష్టం చేశారు. యాదాద్రిలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీని మూడోసారి ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలకు భ్రమలు తొలగుతున్నాయన్నారు ఈటల రాజేందర్. అమలుకు నోచుకోని హామీలిచ్చి.. అప్పు కావాలని ఢిల్లీలో మోడీ, అమిత్‌షాకు రేవంత్ దండం పెడుతున్నారన్నారు. "మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో ప్రయాణికులు పెరిగినా.. బస్సులు పెరగలేదు. కేసీఆర్ ఐదేళ్ల పాలనలో లక్ష రూపాయాల రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదు. రేవంత్ రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామంటున్నారు. అది ఏమాత్రం సాధ్యం కాదు. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలతోనే అరచేతిలో వైకుంఠం చూపెడతున్నారు. మేనిఫెస్టోను కాంగ్రెస్ మరోసారి చదువుకుంటే బాగుంటుందంటూ చురకలు అంటించారు ఈటల రాజేందర్. మేడిగడ్డపై సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. అధికారం వచ్చాక మాట మార్చిందని మండిపడ్డారు.