నేనేమీ ఊరికే అనలేదు.. కేసీఆర్‌పై కచ్చితంగా పోటీ చేస్తా
ఈటల రెండు చోట్ల పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవచ్చని.. కాబట్టి కేసీఆర్ పై ఈటల పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటల ఈ విషయమై మరోసారి స్పందించారు.
గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని తాను ఊరికే అనలేదని, కచ్చితంగా పోటీ చేసి తీరుతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని కొద్ది రోజుల కిందట ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ఈటల రెండు చోట్ల పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవచ్చని.. కాబట్టి కేసీఆర్ పై ఈటల పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటల ఈ విషయమై మరోసారి స్పందించారు.
జమ్మికుంటలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ ప్రారంభానికి ముందు ఈటల మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఉప ఎన్నికలో హుజూరాబాద్ లో తన ఓటమి కోసం బీఆర్ఎస్ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే తిష్ట వేసి తనను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు.
అందుకోసం అధికార యంత్రాంగాన్ని కూడా వినియోగించుకున్నారని తెలిపారు. అయినప్పటికీ ఆ ఉప ఎన్నికలో తానే గెలిచానని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈటల చెప్పారు. అందుకోసమే గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయనున్నట్లు కొద్ది రోజుల కిందట చెప్పానని, ఇప్పటికీ ఆ మాటకు, పోటీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.