Telugu Global
Telangana

పొంగులేటి దగ్గరకు వెళ్తున్నట్లు ఈటల నాకేం చెప్పలేదు.. బండి సంజయ్ వ్యాఖ్యలు

బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఫోన్ లేకపోతే.. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోరా అని పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

పొంగులేటి దగ్గరకు వెళ్తున్నట్లు ఈటల నాకేం చెప్పలేదు.. బండి సంజయ్ వ్యాఖ్యలు
X

తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయక్వంలో ఉన్న లుకలుకలు మరో సారి బయటపడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మధ్య మొదటి నుంచి పొసగడం లేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని పార్టీలోనే చర్చ జరుగుతున్నది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీపై పట్టు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. దీంతో ఇతర నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గతంలో వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు అనేక సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక విషయంలో మరోసారి బయటపడ్డాయి.

బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీల్లోకి తీసుకొని రావాలని కాంగ్రెస్, బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గత నెలలో హోం మంత్రి అమిత్ షా చేవెళ్ల పర్యటనకు వచ్చినప్పుడే పొంగులేటి చేరతారని బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే అతడిని పార్టీలోకి తీసుకొని రావడంలో విఫలం కావడంతో చేరికల కమిటీ చైర్మన్ ఈటలకు గట్టిగానే క్లాస్ పడింది. ఇక ఈ నెల 8న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ హైదరాబాద్ రానున్నారు. సరూర్‌నగర్‌లో జరిగే సభలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల గురువారం ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి వెళ్లారు.

పొంగులేటిని ఎలాగైనా బీజేపీలోకి తీసుకొని రావడానికి ఈటల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ విషయంలో బండి సంజయ్‌కి సమాచారం లేదని తెలిసింది. కరీంనగర్‌లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి విషయంపై స్పందించమని మీడియా కోరగా.. ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి దగ్గరకు ఈటల రాజేందర్ వెళ్లారన్న సమాచారం లేదని, ఆయన పార్టీలో చేరుతున్న విషయం తనకు తెలియదని బండి అన్నారు.

అయితే, తన వ్యాఖ్యలు పార్టీకి చేటు తెచ్చేలా ఉన్నాయని గ్రహించిన బండి సంజయ్.. వెంటనే మాట మార్చారు. తన వద్ద ఫోన్ లేదని.. అందుకే ఇప్పటి వరకు సమాచారం అందలేదని చెప్పుకొచ్చారు. తనకు చెప్పకపోయినా ఏమీ కాదని.. పొంగులేటి పార్టీలోకి రావాలనుకుంటే ఆహ్వానిస్తామన్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఫోన్ లేకపోతే.. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోరా అని మండిపడుతున్నారు. బండి, ఈటల మధ్య విభేదాలు ఉన్న విషయం మరోసారి స్పష్టమైందని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.

First Published:  4 May 2023 2:52 PM IST
Next Story