Telugu Global
Telangana

పాలమూరుకు పర్యావరణ అనుమతులు.. ఈఏసీ పెట్టిన షరతులు ఇవే

పర్యావరణ సమతుల్యం, సామాజిక పరిస్థితులను సరి చేసేందుకు రూ.153.70 కోట్లు కేటాయించాలని.. రానున్న మూడేళ్ల కాలంలో దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ద్వారా నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరింది.

పాలమూరుకు పర్యావరణ అనుమతులు.. ఈఏసీ పెట్టిన షరతులు ఇవే
X

దక్షిణ తెలంగాణకు వర ప్రదాయినిగా పిలుస్తున్న పాలమూరు - రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయి. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా చేపట్టే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 13.38 లక్షల ఎకరాలకు సాగు నీరు.. వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఈ నిర్మాణం ప్రారంభించింది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున.. ఏడాదిలో 60 రోజుల పాటు 90 టీఎంసీలను ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టులో 4 లిఫ్టులు, 5 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు నార్లాపూర్ రిజర్వాయర్ 89.44 శాతం, ఏదుల రిజర్వాయర్ 90 శాతం, వట్టెం రిజర్వాయర్ 70 శాతం, కరివెన రిజర్వాయర్ 60 వాతం, ఉదండాపూర్ రిజర్వాయర్ 78 శాతం మేర పనులు పూర్తయ్యాయి.

కాగా, ఈ ఎత్తిపోతల పనుల్లో పర్యావరణ పరమైన ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని.. దీనికి సంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ఎన్విరాన్‌మెంటల్ అసెస్‌మెంట్ కమిటీ (ఈఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నెల 24న నిర్వహించిన సమావేశంలో కొన్ని మినిట్స్ రూపొందించింది. వాటిని తాజాగా విడుదల చేసింది.

పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం సందర్భంగా దెబ్బతిన్న పర్యావరణ సమతుల్యం, సామాజిక పరిస్థితులను సరి చేసేందుకు రూ.153.70 కోట్లు కేటాయించాలని.. రానున్న మూడేళ్ల కాలంలో దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక ద్వారా నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. ఐదేళ్ల కాలానికి గాను రూ.153.70 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ చూపించాలని ఆదేశించింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గతంలో చేసిన సూచనలు అమలు చేయాలి. అలాగే రాష్ట్ర అటవీ శాఖ, స్థానిక పంచాయతీల నేతృత్వంలో ప్రతిపాదిత జలాశయాల పరిధిలో 500 మీటర్ల వెడల్పుతో పచ్చదనం పెంచాలి. గతంలో ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలనే తిరిగి నాటాలని సూచించింది. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు.. శుద్ధి చేసిన నీటిని అందించాలని కోరింది.

ఆయా గ్రామాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యలు పెంచాలని కోరింది. ముంపు బాధిత కుటుంబాలకు ఉద్యోగ శిక్షణకు సంస్థాగతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని షరతు పెట్టింది. ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వారికి గోబర్ గ్యాస్, సోలార్ ప్లేట్లు అందించాలని కోరింది.

First Published:  11 Aug 2023 11:00 AM IST
Next Story