Telugu Global
Telangana

తెలంగాణ సర్కారు బడులకు క్యూ కడుతున్న విద్యార్థులు.. ఇంగ్లీష్ మీడియం కారణం అంటున్న టీచర్లు

ఇప్పటి వరకు 91,352 మంది విద్యార్థులు బడిబాటలో ఎన్‌రోల్ చేసుకున్నారు. వీరిలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి.. ప్రభుత్వ బడుల్లో చేరుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

తెలంగాణ సర్కారు బడులకు క్యూ కడుతున్న విద్యార్థులు.. ఇంగ్లీష్ మీడియం కారణం అంటున్న టీచర్లు
X

తెలంగాణలోని సర్కారు బడులకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 'బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య పెంచడమే కాకుండా, బడి బయట ఉన్న విద్యార్థులను కూడా చదువుకు దగ్గర చేయాలనే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం ఎలా అని టీచర్లు మొదట ఆందోళన చెందారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అన్ని పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 91,352 మంది విద్యార్థులు బడిబాటలో ఎన్‌రోల్ చేసుకున్నారు. వీరిలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి.. ప్రభుత్వ బడుల్లో చేరుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యతో పాటు బుక్స్, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు ఉండటంతో చాలా మంది సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తున్నదని.. సీట్ల కోసం ప్రతీ రోజు పేరెంట్స్ స్కూల్స్‌కు వస్తున్నట్లు ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల్లలో అందుతున్న సదుపాయాల పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగింది. అందుకే ఇంత భారీ స్పందన వస్తోందని అన్నారు. ఈ సారి తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియంలో చేర్చడానికే పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. తెలుగు మీడియంలో ప్రతీ ఏడాది విద్యార్థులు సంఖ్య తగ్గిపోతున్నదని తెలిపారు.

బడి బాట కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభం అయ్యింది. మొదట్లో ఈ కార్యక్రమానికి అంతగా స్పందన లభించలేదు. అయితే గత రెండు రోజుల నుంచి పాఠశాలల్లో నమోదు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. స్యూల్ రీ ఓపెనింగ్ రోజుకు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఈవో, ఎంఈవోలకు అధికారులు ఆదేశించారు.

First Published:  8 Jun 2023 1:58 AM GMT
Next Story