Telugu Global
Telangana

స్విమ్మింగ్‌ పూల్‌లో విద్యుత్‌ షాక్‌.. 16 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

స్విమ్మింగ్‌ పూల్‌ లోపల లైటింగ్‌ కోసం ఏర్పాటుచేసిన వైరింగ్‌ తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఆ లైట్లకు వైర్ల కనెక్షన్లను లోపలి నుంచి కాకుండా బయటినుంచి ఇచ్చారు.

స్విమ్మింగ్‌ పూల్‌లో విద్యుత్‌ షాక్‌.. 16 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
X

సరదాగా స్విమ్మింగ్‌ చేస్తూ ఆహ్లాదంగా గడపాలనుకున్నవారిని విద్యుత్‌ షాక్‌ రూపంలో ప్రమాదం చుట్టుముట్టింది. హైదరాబాద్‌ శివారులో ఉన్న జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది గాయాలపాలవగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్‌పల్లిలోని ఫాంహౌస్‌కు గురువారం ఉదయం వెళ్లారు. సాయంత్రం వేళ 16 మంది స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగి ఈత కొడుతుండగా.. ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీంతో పూల్‌లో ఉన్నవారంతా గాయపడ్డారు. ఆ సమయంలో స్విమ్మింగ్‌ పూల్‌ చివర ఉన్న ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ముగ్గురు యువకులు గాయాలపాలవగా, మధ్యలో ఉన్న పర్వేజ్‌ (19), ఇంతియాజ్‌ (22) రెండు నిమిషాల పాటు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ వారిద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపినట్టు సమాచారం.

స్విమ్మింగ్‌ పూల్‌ లోపల లైటింగ్‌ కోసం ఏర్పాటుచేసిన వైరింగ్‌ తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఆ లైట్లకు వైర్ల కనెక్షన్లను లోపలి నుంచి కాకుండా బయటినుంచి ఇచ్చారు. ఆ వైరు స్విమ్మింగ్‌ పూల్‌లోనే తెగిపోవడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు వివరించారు.

First Published:  12 July 2024 5:35 AM GMT
Next Story