Telugu Global
Telangana

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల

అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్ జరగనున్నాయి.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల
X

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్ జరగనున్నాయి.

7 జిల్లాలు, 11 డివిజన్లు.. 40 వేల మంది కార్మికులు

సింగరేణి సంస్థ పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం, ఖమ్మం, ఆసిఫాబాద్​, జయశంకర్ ​భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉంది. సింగరేణి సంస్థకు మొత్తం 11 డివిజన్లు ఉండగా... ప్రస్తుతం 40 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఇక సింగరేణిలో చివరిసారిగా 2017లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా..బీఆర్ఎస్‌ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం-TGBKS 9 డివిజన్లలో విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. 2017 ఎన్నికల సమయంలో కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ... ఎన్నికైన తరువాత అందించే గెలుపు పత్రంలో మాత్రం రెండేళ్లుగానే పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ​ప్రకారం గడువు 2019 సెప్టెంబర్‌లోనే ముగిసిపోయింది.

రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతూనే వచ్చాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేయడానికి ప్రాంతీయ లేబర్ కమిషనర్​తో పాటు కేంద్ర లేబర్​ ఉప కమిషనర్‌ రెడీ అయ్యారు. ఏప్రిల్ 2న షెడ్యూల్​ విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. ఈ క్రమంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించారు. మార్చి, ఏప్రిల్​ నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎక్కువగా ఉంటుందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టార్గెట్ రీచ్‌ కాలేమని హైకోర్టుకు వివరించారు. దీంతో ఈ ఏడాది జూన్​ 1వ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.


First Published:  27 Sept 2023 3:24 PM GMT
Next Story