రేసులో వెనుకబడ్డ కాంగ్రెస్.. కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో సామాజిక వర్గాల సమతుల్యత లోపించిందన్న విమర్శ ఉంది. ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులను ప్రకటిస్తే ఇందులో ఆరుగురు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.
పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలను పెండింగ్‌లోనే ఉంచింది. 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ జోష్ చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో జాప్యానికి సమర్థులైన నాయకులు దొరక్కపోవడమే కారణమన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 14మంది అభ్యర్థులనే ప్రకటించింది.
1.మహబూబ్‌నగర్-వంశీచందర్‌రెడ్డి
2.నల్లగొండ-రఘువీర్‌రెడ్డి
3.భువనగిరి-చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
4.నిజామాబాద్-టీ జీవన్‌రెడ్డి
5.చేవెళ్ల-రంజిత్‌రెడ్డి
6.మల్కాజిగిరి-సునీతా మహేందర్‌రెడ్డి
7.వరంగల్-కడియం కావ్య (మాల)
8.నాగర్‌కర్నూల్-మల్లు రవి (మాల)
9.పెద్దపల్లి-గడ్డం వంశీకృష్ణ (మాల)
10.మహబూబాబాద్-బల్‌రాం నాయక్ (ఎస్టీ)
11.ఆదిలాబాద్- ఆత్రం సుగుణ (ఎస్టీ)
12.మెదక్-నీలం మధు(బీసీ)
13.జహీరాబాద్-సురేశ్ షెట్కార్ (బీసీ)
14.సికింద్రాబాద్-దానం నాగేందర్ (బీసీ)
15.ఖమ్మం-ఖరారు కాలేదు
16.కరీంనగర్- ఖరారు కాలేదు
17.హైదరాబాద్-ఖరారు కాలేదు
కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో సామాజిక వర్గాల సమతుల్యత లోపించిందన్న విమర్శ ఉంది. ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులను ప్రకటిస్తే ఇందులో ఆరుగురు అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఖమ్మం సీటును కూడా రఘురాంరెడ్డికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రెడ్డి సామాజికవర్గానికే ఏడు సీట్లు ఇచ్చినట్టు అవుతుంది. 3 ఎస్సీ రిజర్వు స్థానాలనూ మాల సామాజికవర్గానికే ఇవ్వడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతలతోపాటు మాదిగ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు బీసీలకు మూడుసీట్లు మాత్రమే ఇవ్వడంపై ఆ వర్గాలు సైతం తీవ్ర అసంతృలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు ప్రాధాన్యం దక్కలేదని, ఇప్పుడు పార్లమెంటులోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని బీసీలు మండిపడుతున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడుస్థానాల్లో కనీసం కరీంనగర్ టికెట్ అయినా బీసీకి ఇవ్వాలని కోరుతున్నారు. అధిష్టానం మాత్రం ఆ స్థానం నుంచి వెలమ సామాజికవర్గానికి చెందిన వెలిచాల రాజేందర్‌రావును బరిలోకి దింపాలని చూస్తున్నట్టు తెలిసింది. బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా హైదరాబాద్ స్థానాన్ని మొక్కుబడిగా కేటాయించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. బీసీలు, మాదిగ సామాజికవర్గం పార్టీకి దూరమైతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని పార్టీలోని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.