Telugu Global
Telangana

ఎలక్షన్ స్పెషల్.. నేతన్నలకు కండువాల పండగ

తెలంగాణ ఎన్నికలైపోయినా, సార్వత్రిక హడావిడి ఉంటుంది. ఇటు ఏపీలో ఎన్నికల కోలాహలం పెరుగుతుంది. అంటే మరో ఏడాదికి పైగా నేతన్నలకు ఈ గిరాకీ ఉంటుందని తెలుస్తోంది.

ఎలక్షన్ స్పెషల్.. నేతన్నలకు కండువాల పండగ
X

సిరిసిల్ల నేతన్నలు బిజీగా మారిపోయారు. నిన్న మొన్నటి వరకూ బతుకమ్మ చీరల ఆర్డర్లతో బిజీగా ఉన్నారు. చీరల తయారీ, సరఫరా ఓ కొలిక్కి వచ్చింది. తాజాగా వారికి కండువాల పండగ మొదలైంది. వివిధ రాజకీయ పార్టీలు కండువాల ఆర్డర్లు ఇస్తున్నాయి. పార్టీ జెండాల ఆర్డర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో సిరిసిల్ల నేత కార్మికులు బిజీ బిజీగా కనపడుతున్నారు. ఎన్నికలయ్యే వరకు ఉపాధికి ఢోకా లేదని చెబుతున్నారు.

కండువాల పండగ..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కండువలా పండగ మొదలైంది. ఈ పార్టీనుంచి ఆ పార్టీకి, ఆ పార్టీనుంచి ఈ పార్టీకి మారేవారు ఎక్కువయ్యారు. తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన మొదలైన తర్వాత ఈ జంపింగ్ లు జోరందుకున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశముంది. దీంతో నాయకులు కండువాలకోసం ఆర్డర్లు ఇస్తున్నారు. ముందుగా తెల్లని వస్త్రాన్ని తయారు చేస్తారు. దానిపై వివిధ పార్టీల, నాయకుల గుర్తులు, ఫొటోలు ముద్రిస్తారు. పూర్తి స్థాయి జెండాలు, కండువాలు సిరిసిల్లలోనే తయారవుతున్నాయి. ఎలక్షన్ సందడితో నేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది.

ఏపీనుంచి కూడా..

పార్టీ జెండా తయారీకి ఒకటిన్నర మీటరు వస్త్రం కావాలి, కండువాకి మీటర్ సరిపోతుంది. దీని ప్రకారం బల్క్ గా వస్త్రాన్ని తయారు చేసి, తర్వాత కట్ చేసి కండువాలు తయారు చేస్తారు. బీఆర్ఎస్ నుంచి 5 లక్షల మీటర్ల వస్త్రం తయారీకి ఆర్డర్లు వచ్చాయని అంటున్నారు. వైసీపీ కూడా అదే స్థాయిలో కండువాలను ఆర్డర్ చేసింది. మిగతా పార్టీలనుంచి కూడా ఆర్డర్లు వస్తాయని అంటున్నారు ఉత్పత్తిదారులు.

ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తే కండువాలకు, పార్టీ జెండాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు సిరిసిల్ల కార్మికులు. తెలంగాణ ఎన్నికలైపోయినా, సార్వత్రిక హడావిడి ఉంటుంది. ఇటు ఏపీలో ఎన్నికల కోలాహలం పెరుగుతుంది. అంటే మరో ఏడాదికి పైగా నేతన్నలకు ఈ గిరాకీ ఉంటుందని తెలుస్తోంది.

First Published:  6 Sept 2023 8:07 AM IST
Next Story